బాబు లోకేష్ కష్టం...వారిది అంతా ఇష్టం
తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో చంద్రబాబు ఏళ్లకు ఏళ్లు నడిపారు. అయితే కలిసొచ్చే కాలానికి లోకేష్ అంది వచ్చారు.
By: Satya P | 24 Oct 2025 10:00 AM ISTతెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో చంద్రబాబు ఏళ్లకు ఏళ్లు నడిపారు. అయితే కలిసొచ్చే కాలానికి లోకేష్ అంది వచ్చారు. ఆయన పార్టీని చూసుకుంటూ వస్తున్నారు. దాంతో బాబు ప్రభుత్వ బాధ్యతలు మోస్తూ ముందుకు సాగుతున్నారు. 2024 లో అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీలో ఈ విధమైన విభజన అయితే కొంత కనిపిస్తూ వచ్చింది. పార్టీ మీద లోకేష్ అయితే బాగానే పట్టు సాధించారు. కానీ ప్రభుత్వం కూడా ఇపుడు అనేక రకాలైన సమస్యలతో కీలకమైన దశలో ఉంది. ఏపీలో ప్రజలు కూటమిని భారీ మెజారిటీతో పట్టం కట్టారు. దాంతో ఈ టెర్మ్ లో అభివృద్ధి ఏమిటో నిరూపించుకోవాలని చంద్రబాబు గట్టి పట్టుదల మీద ఉన్నారు.
పెట్టుబడుల వేటలో :
ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తే అవి గ్రౌండింగ్ అయ్యేసరికి ఎన్నికలు వచ్చినా తాము చేసిన అభివృద్ధి ఎంతో కొంత జనాలకు కనిపిస్తుందని ఆ విధంగా 2029 ఎన్నికల్లో మరోసారి గెలవవచ్చు అన్నది రాజకీయ వ్యూహంగా టీడీపీకి ఉంది. మరో వైపు చూస్తే లోకేష్ ని భావి నాయకుడిగా ముందు పెట్టిన పార్టీ ఆయనకు రాచబాట వేస్తోంది. రానున్న కాలంలో ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి పధంలో ప్రయాణించేలా చేస్తే కనుక యువ నేతగా లోకేష్ కి అది ఎంతగానో ఉపకరిస్తుంది అన్న ప్రణాళికలూ ఉన్నాయి. మొత్తానికి చూస్తే కూటమి చేతిలో ఉన్న మూడున్నరేళ్ళ అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుని ఏపీ దశతో పాటు టీడీపీ దశను కూడా మార్చాలన్నది చంద్రబాబు అండ్ లోకేష్ ఆలోచనగా ఉంది. అందుకే నవంబర్ లో 14, 15 తేదీలలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుని ఎంతో ప్రతిష్టగా తీసుకున్నారు.
ఎంతో శ్రమిస్తూ :
ఇక లోకేష్ అయితే ఆస్ట్రేలియాలో వారం రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. అలాగే చంద్రబాబు అరబ్ దేశాల టూర్ పెట్టుకున్నారు. అంతకు ముందు లోకేష్ విదేశాలకు ఒక విడత పర్యటించి పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఏడాది దావోస్ కి కూడా చంద్రబాబు లోకేష్ కలసి వెళ్ళారు ఒక విధంగా చంద్రబాబు లోకేష్ కృషితో ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇక విశాఖలో జరిగే సదస్సులో భారీ లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నారు. అందుకే విపరీతంగా శ్రమిస్తున్నారు.
వివాదాలతో :
అయితే టీడీపీ అధినేతలు అయిన చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఎంతో కష్టపడుతున్న తీరు ఒక వైపు కనిపిస్తున్నా పార్టీలో కొందరు నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదని అంటున్నారు. వారు తమ వైఖరితో ముందుకు సాగుతూ పార్టీకి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు అని అంటున్నారు వర్గ పోరుకు తెర తీస్తూ రాజకీయ రచ్చకు ఆస్కారం ఇస్తున్నారు. అంతే కాదు తమ ఆధిపత్యం కోసం వారు చేస్తున్న రాజకీయంతో టీడీపీకి ఇబ్బందులను తెస్తోంది అని అంటున్నారు. పార్టీని ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఏపీకి అతి తక్కువ అయిదేళ్ళ కాలంలో అభివృద్ధిని చూపించాలని చంద్రబాబు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలను కొందరు నేతలు అర్ధం చేసుకోవడం లేదా అన్న చర్చ అయితే సాగుతోంది.
సీరియస్ గానే :
అయితే పార్టీ ముఖ్యమని చంద్రబాబు ఎపుడూ చెబుతూ ఉంటారు. ఎవరు గీత దాటినా ఊరుకోమని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉంటారు. ఇక చూస్తే అధినేతలు ఇద్దరూ దేశంలో లేరు, వారు విహార యాత్రలకు పోలేదు, రాష్ట్రాభివృద్ధి కోసం పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ వంతుగా చేయాల్సిన సహకారం చేయాలి కదా అన్నది కూడా పార్టీలో వినిపిస్తోంది. మరి దారికి రాకుండా తమ రూటే తమది అనుకున్న వారి విషయంలో సీరియస్ గానే వ్యవహరించాలని అంటున్నారు. ఏది ఏమైనా అధినేత పదే పదే చెబుతున్నా తీరు మార్చుకోని వారి విషయంలో కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నారు. కొందరు చేసే వైఖరి వల్ల మొత్తం పార్టీ ఇబ్బందులు పడదు కదా అన్న మాట కూడా వ్యక్తం అవుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
