వైసీపీపై నిన్న లోకేష్, నేడు చంద్రబాబు...అదే వ్యూహం !
గొడ్డలి పార్టీ వైసీపీ అన్నది సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీ యాక్టివిస్టుల మధ్య జరిగే పోస్టుల వార్ లో నుంచి పుట్టిన పేరుగా చెబుతారు.
By: Satya P | 26 July 2026 8:58 AM ISTవైసీపీని గొడ్డలి పార్టీగా మార్చేసింది టీడీపీ. సాధారణంగా ఇలాంటి సెటైరికల్ పేర్లు సోషల్ మీడియా పోస్టులలో కనిపిస్తాయి. అక్కడే వీటి మీద వార్ సాగుతుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ లో ఏకంగా కీలక రాజకీయ పార్టీలు వాటి అగ్ర నేతలు ఈ పేర్లను తీసుకుని విమర్శలు చేయడం పెద్దగా ఉండదు, ఎందుకంటే సోషల్ మీడియా పోస్టులను ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక రాజకీయ పార్టీ అధికారికంగా అదే విమర్శలను పదే పదే చేస్తోంది అంటే దాని మీద ఆ పార్టీకి బలమైన వ్యూహం ఉండాలి, అంతే కాదు జనాలలోకి దానిని పెట్టి అవతల ప్రత్యర్థిని ఇరకాటంలో పెట్టగలమన్న ధీమా కూడా ఉండాలి. ప్రస్తుతం టీడీపీ అదే పని చేస్తోంది. గొడ్డలి పార్టీ వైసీపీ అన్నది సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీ యాక్టివిస్టుల మధ్య జరిగే పోస్టుల వార్ లో నుంచి పుట్టిన పేరుగా చెబుతారు.
బాబాయిని లేపేశారు అంటూ :
నిన్నటికి నిన్న కడపలో ప్రారంభోత్సవాలకు వెళ్ళినపుడు మంత్రి నారా లోకేష్ నేరుగా జగన్ మీదనే ఈ ఘాటు విమర్శ చేశారు. జగన్ తన సొంత బాబాయ్ నే లేపేశారు అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే దీని మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అంతే తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు సీబీఐ వంటి సంస్థలే ఈ కేసులో జగన్ ప్రమేయం ఎక్కడా లేదని తేల్చాయని ఆయన అంటూ లోకేష్ తీరు మీద మండిపడ్డారు. ఈ తరహా విమర్శలు చేయడం ఆధార రహితంగా మాట్లాడం టీడీపీకి అలవాటు అయింది అని కూడా నిందించారు.
బాబు సైతం దూకుడుగా :
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు పర్యటనలో వైసీపీ మీద విమర్శలు చేసే క్రమంలో మళ్ళీ బాబాయ్ వివేకానందరెడ్డి అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సొంత బాయిని గొడ్డలితో లేపేశారు అని బాబు వైసీపీ అధినాయకత్వం మీద మండిపడ్డారు. చివరికి ఆ కేసును టీడీపీ మీదకు నెట్టి సానుభూతితో ఓట్లు సంపాదించుకోవాలని చూశారని బాబు నిప్పులు చెరిగారు. వైసీపీ గతంలో చేసిన నీచ రాజకీయాలు అన్నీ ఇన్నీ కావని అవి ఇక మీదట ఏ మాత్రం సాగవని బాబు స్పష్టం చేసారు. రౌడీయిజం చేసే వారిని అలాగే ఆడబిడ్డల జోలికి వచ్చేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని బాబు గట్టిగా చెప్పారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు ఉండేవని, తమ పాలనలో శాంతిని నెలకొల్పామని గుర్తుచేశారు.
డిఫెన్స్ లో వైసీపీ :
గొడ్డలి పార్టీ అని టీడీపీ పదే పదే అంటున్నా వైసీపీ నుంచి నీరసమైన ప్రతిస్పందన వస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా డిఫెన్స్ లో వైసీపీ ఉందని చెబుతున్నారు. ఈ కేసు విషయంలో సొంత చెల్లెలు సునీత నుంచే వ్యతిరేకత రావడం ఆమె కోర్టులకు వెళ్ళి మరీ పోరాడడం కూడా వైసీపీకి ఇరకాటంగా మారింది. ఇక షర్మిల సైతం ఈ కేసు విషయంలో 2024 ఎన్నికల సందర్భంగా వైసీపీనే నిందించారు. అదే ఇపుడు టీడీపీకి కలసి వస్తోంది అని అంటున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లో గొడ్డలి ప్రభావం చాలా ఎక్కువగానే చూపించింది. అందుకే వైసీపీకి మొత్తం 52 సీట్లు ఉన్న రాయలసీమలో కేవలం ఏడు మాత్రమే దక్కాయని గుర్తు చేస్తున్నారు. అయితే టీడీపీ వైసీపీ మీద చేసే రాజకీయ విమర్శలు వేరు గొడ్డలి పార్టీ అంటూ చేసే విమర్శలు వేరు అని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ డిఫెన్స్ నుంచి అఫెన్స్ మోడ్ లోకి రాకపోతే మాత్రం బూమరాంగ్ అవుతుందని అంటున్నారు.
