చంద్రబాబుకు.. జగన్ కు తేడా అదేనా?
ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా అత్యున్నత స్థానాలకు వెళ్లే కొద్దీ తలనొప్పులు అదే స్థాయిలో ఉంటాయి.
By: Garuda Media | 21 Aug 2025 1:47 PM ISTఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా అత్యున్నత స్థానాలకు వెళ్లే కొద్దీ తలనొప్పులు అదే స్థాయిలో ఉంటాయి. రాజకీయ రంగంలో ఇవి మరింత ఎక్కువ. పార్టీ అధినేతలు సుప్రీం అయినప్పటికీ.. వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీటిని డీల్ చేసే విషయంలో వారు చేసే తప్పులు.. వారి ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తాయి. అధినేతలు సొంతంగా తప్పులు చేయకున్నా.. తప్పులు చేసిన వారి విషయంలో స్పందించే తీరు వారికి ఇబ్బందుల్ని తెచ్చి పెడతాయి.
తమ పార్టీ నేతలు.. ముఖ్యంగా ఎంపీలు.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు కొందరు చేసే తప్పుల విషయంలో చంద్రబాబు వర్సెస్ జగన్ ను పోల్చినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఇక్కడే దివంగత మహానేత వైఎస్ తీరును గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ చంద్రబాబు మెతక అని.. పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వారిపై చర్యలు తీసుకునే విషయంలో విపరీతంగా నాన పెడతారన్న విమర్శ చేస్తుంటారు. అయితే.. ఇదంతా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో.. అధిపత్య పోరు విషయాల్లోనే.
అదే.. ఎవరైనా శ్రుతిమించి.. చట్టవిరుద్దంగా వ్యవహరిస్తే మాత్రం ఆయన కొరడా ఝుళిపించేందుకు ఏ మాత్రం వెనుకాడరు. సొంత పార్టీకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎపిసోడ్ చూస్తే.. వీరంగం వేసిన ఆయనపై కేసు నమోదు విషయంలో తటపటాయిస్తుంటే.. ఏం ఫర్లేదు.. కేసు నమోదు చేయండి. ఇలాంటి విషయాల్లో వెనక్కి తగ్గితే ప్రజలకు రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుందన్న సంకేతాల్ని పంపినట్లుగా చెబుతున్నారు. హద్దు మీరే నేతలకు షాకులు ఇచ్చే విషయంలో చంద్రబాబు మహా కరకుగా ఉంటారనే చెప్పాలి.
2024 ఎన్నికల్లో చారిత్రక విజయం అనంతరం..మొదటిసారి మంత్రిగా అవకాశం చేజిక్కించుకున్నరాయలసీమ జిల్లాలకు చెందిన నేత సతీమణి చేసిన ఓవరాక్షన్ విషయంలో చంద్రబాబు సీరియస్ అయిన తీరు.. హెచ్చరించిన విధానం పార్టీలో అందరూ మాట్లాడుకునేలా చేస్తుంది. పార్టీ నేతల మధ్య ఉండే పంచాయితీలను పరిష్కరించే విషయంలో వెనుకబడినా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం.. నిబంధనల్ని పాటించని వారిపై మాత్రం సీరియస్ యాక్షన్ ఉండటం చంద్రబాబుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే..పార్టీ నేతలు.. అందునా తనకు అండగా నిలిచే వారి విషయంలో వ్యవహరించే తీరు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. వేలెత్తి చూపేలా చేస్తుందని చెప్పాలి. ఐదేళ్ల జగన్ పాలనలో పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రుల ఒవరాక్షన్ ను ఖండించటం.. కట్టడి చేయటం లాంటి అంశాల్లో జగన్ పెద్దగా పట్టించుకునే వారు కాదు. అంతిమంగా ఈ తీరు ఆయన ప్రభుత్వానికి నెగిటివ్ గా మారిందని చెప్పాలి. నేతల్ని ఎక్కువగా నమ్మటం.. వారిపై చర్యలు తీసుకునే విషయంలో పెద్దగా ఆసక్తి ప్రదర్శించని ఆయన వైఖరి పార్టీ నేతలకు ఆయనంటే మరింత భక్తి పెంచేలా చేయటమే కాదు తాము తమకు నచ్చినట్లుగా వ్యవహరించేలా చేస్తుందని చెప్పాలి.
జగన్ తీరుకు భిన్నంగా ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీరు ఉంటుందని చెబుతారు. తనకు సన్నిహితులైనప్పటికి కొన్నివిషయాల్లో మాత్రం కఠినంగా ఉండటమే కాదు.. ఏందీ పద్దతి?అని ముఖం మీదే అడిగేసేశారని చెబుతారు. అవినీతి.. నిధుల దుర్వినియోగం లాంటి అంశాలను పెద్దగా పట్టించుకోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ప్రజల్లో పలుచన అయ్యేలా వ్యవహరించే అంశాల్లో మాత్రం సీరియస్ గా స్పందించటం చేసే వారని చెప్పాలి. కాకుంటే.. కేసులు.. చర్యలు నామమాత్రంగా ఉండేలా వ్యవహరించేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీరుకు మరో లెవల్ అన్నట్లు జగన్ తీరు ఉంటుందని చెబుతారు. తన మనుషులపై ఈగ వాలేందుకు ఇష్టపడని అధినేతగా జగన్ ఉంటే.. పరిమితుల్లో ఉంటే ఫర్లేదు.. తేడా వస్తే మాత్రం పక్కన పెట్టేయటమే అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉంటుందని చెప్పాలి. ఈ తీరు కొందరు నేతలకు నచ్చదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
