చలి ఉత్సవ్ లో చంద్రబాబు
ఏపీలో ఈవెంట్లు పెద్ద ఎత్తున జరుగుతున్న నిన్న విజయవాడ ఉత్సవ్ జరిగి ఎంతో ఆనందం నింపితే నేడు విశాఖ ఉత్సవ్ జరుగుతోంది.
By: Satya P | 27 Jan 2026 11:42 PM ISTఏపీలో ఈవెంట్లు పెద్ద ఎత్తున జరుగుతున్న నిన్న విజయవాడ ఉత్సవ్ జరిగి ఎంతో ఆనందం నింపితే నేడు విశాఖ ఉత్సవ్ జరుగుతోంది. ఇది కూడా అద్భుతంగా సాగుతోంది. ఇపుడు అదే వరసలో అరకులో చలి ఉత్సవ్ కి రంగం సిద్ధం అయింది. ఈ చలి ఉత్సవ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రారంభించేందుకు నేరుగా ఏజెన్సీకి వస్తున్నారు. గిరిజనుల కోసం నిర్వహించే ఈ చలి ఉత్సవ్ లో వారి సంప్రదాయాలను హైలెట్ చేయడమే కాకుండా ఇతర ప్రాంతాల వారికి వాటి గురించి సదా మననం చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం చలి ఉత్సవ్ ని నిర్వహిస్తోంది.
రెండు నెలల తేడాలో :
ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది చివరిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు వచ్చారు. ఆయన అప్పట్లో ఆయన సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. అంతే కాకుండా భారీ బహిరంగ సభ నిర్వహించి గిరిజనులకు తమ ప్రభుత్వం చేసిన చేయబోతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఇప్పుడు మరోసారి అరకు టూర్ చంద్రబాబు పెట్టుకున్నారు. దాంతో అధికార యాంత్రాంగం అప్రమత్తం అవుతోంది.
గిరిజన సంస్కృతి వైభవం :
ఇదిలా ఉంటే గిరిజన సంస్కృతి ప్రాభవాన్ని మొత్తం ప్రపంచానికి తెలియచేయాలన్నదే చలి ఉత్సవ్ కార్యక్రమం వెనక ఉద్దేశ్యమని అన్నారు. ఇక ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున గిరిజనులు తరలి వస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా మన్య సీమలో ఉన్న కళా రూపాలను ఇతర అభిరుచులను చాటి చెప్పేలా ఈ చలి ఉత్సవ్ ఉండబోతోంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 29న అరకు పర్యటన చేపడుతున్నారు. దాంతో ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అదే విధంగా చలి ఉత్సవ్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం తీసుకుంది.
ఒకేసారి మూడు చోట్ల :
మరో వైపు చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా మూడు జిల్లాలుగా విడిపోయింది. దాంతో విశాఖలో విశాఖ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అదే విధంగా అనకాపల్లిలో రెండు రోజుల పాటు ఈ నెల 30, 31 తేదీలలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అల్లూరి జిల్లాలోని అరకులో చలి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. దాంతో ఫిబ్రవరి 1వ తేదీ వరకూ ఈ ఉత్సవాల పరంపర అలా కొనసాగనుంది. పర్యాటక ప్రాజెక్టులు అనేకం ఈ ప్రాంతాలకు తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న నేపధ్యంలో ఈ ఉత్సవాలకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.
