Begin typing your search above and press return to search.

కదిలింది గోదావరి...ఉత్తరాంధ్ర దశ తిరిగింది !

ఇదిలా ఉంటే పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీరు తరలి రావడం వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.

By:  Satya P   |   31 Aug 2026 9:27 AM IST
కదిలింది గోదావరి...ఉత్తరాంధ్ర దశ తిరిగింది !
X

గోదావరి ఎక్కడ. ఉత్తరాంధ్ర ఎక్కడ. కానీ అనుసంధానం చేస్తోంది కూటమి ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్ర కు తీసుకుని రావాలన్న భగీరధ ప్రయత్నం ఫలిస్తోంది. దానికి సుమూర్తం కూడా నిర్ణయం అయింది. సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గోదావరి జలాలు తరలిరానున్నాయి. అలా పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాతో పాటు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందుతున్న చారిత్రాత్మక ఘట్టాన్ని ఆ రోజు ఆవిష్కృతం చేయనుంది.

జల హారతితో వేడుక :

ఇదిలా ఉంటే గోదావరి జలాలు తరలి వస్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, సెప్టెంబర్ 2న పాయకరావుపేటలో చంద్రబాబు చేతుల మీదుగా కూటమి ప్రభుత్వం జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సముద్రంలో వృధాగా కలిసిపోయే గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్ర దారి మళ్ళించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పధకం కింద ఆ ప్రాంత రైతాంగానికి ప్రజల అవసరాలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. దాంతో గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రజలకు కూడా సెప్టెంబర్ 2 గుర్తుండిపోయే పండుగగా మారుతోంది. ఇక పాయకరావుపేట మండలం సీతారాంపురం పీఎల్ పురం ప్రాంతాల వద్ద పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసే చోట ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది అని అంటున్నారు.

ఉత్తరాంధ్రకు ప్రయోజనంగా :

ఇదిలా ఉంటే పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీరు తరలి రావడం వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాల కోసం దాదాపు 27 టీఎంసీల నీటిని నిల్వ చేసి పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది దీంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయానికి భారీ ఊరట కలగనుంది. సరిగ్గా ఇపుడు ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఉత్తరాంధ్ర రైతులకు ఇది ఎంతో తీపి కబురుగా మారుతోంది. ఈ గోదావరి జలాలు వ్యవసాయానికి ఎంతో ఊరటనిస్తాయని అంటున్నారు.

భవిష్యత్తు తరాల కోసం :

అంతే కాదు ఉత్తరాంధ్రాలో వరుసగా వస్తున్న పరిశ్రమలతో పాటు విశాఖ ప్రజలకు తాగునీరు కూడా లభించనుంది. పాతిక లక్షలకు పైగా జనాభాతో ఇప్పటికే అధిక భారం మోస్తున్న విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల పెరుగుతున్న జనాభా అవసరాలకు తాగు నీరు అవసరం ఉందని అంటున్నారు. ఇక పారిశ్రామిక అవసరాలకు గోదావరి నీరు శాశ్వత వనరుగా ఉపయోగపడుతుందని అంటున్నారు. దాంతో అందరి చూపూ సెప్టెంబర్ 2 మీదనే ఉంది. ఆ రోజున జరిగే జల హారతి కార్యక్రమం ఉత్తరాంధ్ర ప్రాంతం సాగునీటి రంగంలో ఒక మైలురాయిగా నిలవనుందని జల వనరుల శాఖ నిపుణులు చెబుతున్నారు.