మోడీతో పాటే బాబు.. ఏం చేస్తున్నారంటే.. !
ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఇటీవల కాలంలో అభిమానం చాటుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దాదాపు మోడీ ఏం చేస్తే.. దానినే ఏపీలోనూ ఫాలో అవుతున్నారు.
By: Garuda Media | 30 Jun 2026 12:00 AM ISTప్రధాని నరేంద్ర మోడీ పట్ల ఇటీవల కాలంలో అభిమానం చాటుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దాదాపు మోడీ ఏం చేస్తే.. దానినే ఏపీలోనూ ఫాలో అవుతున్నారు. బంగారం కొనద్దని, రవాణా ఖర్చులు తగ్గించుకోవాలని, ఇంధనం వినియోగం కూడా తగ్గించాలని చెప్పడంతో చంద్రబాబు తూచ తప్పకుండా పాటించారు.టీడీపీకి అత్యంత కీలకమైన మహానాడును కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఇలా.. మోడీని దాదాపు ఫాలో అవుతున్న చంద్రబాబు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నట్టు తెలుస్తోంది.
కేంద్రంలో మంత్రి వర్గ ప్రక్షాళన జరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో చేసే మార్పులు, చేర్పులను పరిశీలించి.. ఏపీలోనూ అలానే మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో వెనుకబడ్డ వారిని పార్టీ కార్యక్రమాలకు నియమించాలని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే విధానాన్ని ఏపీలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే.. వీరిలో పనిచేసేవారు ఉన్నప్పటికీ.. కొందరిని ముఖ్యంగా సీనియర్లు అనుకున్నవారిని తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.
అలానే.. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని మోడీ నిర్ణయించుకున్నారు. దరిమిలా చంద్రబాబు కూడా ఇప్పుడు జన్-జీ మంత్రాన్ని పఠిస్తున్నారు. మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో 65 ఏళ్లు పైబడిన వారిని తప్పించడం ఖాయమని చెబుతున్నారు. ఇదేసమయంలో యువ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా పార్టీలో యాక్టివ్‌గా ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
ఇక, .. మోడీ వ్యూహం ప్రకారం.. కూటమిని బలోపేతం చేసుకునేందుకు ఆయా పార్టీల ఎంపీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం. వారిని మంత్రులుగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే ఫార్ములాను చంద్రబాబు కూడా పాటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేనకు మరో రెండు మంత్రివర్గ పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం. అలానే బీజేపీకి మరొకటి ఇస్తారని తెలుస్తోంది. తద్వారా కూటమిని బలోపేతం చేసుకుని వచ్చే ఎన్నికలలో వరుస విజయం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
