చంద్రబాబు అనుభవం ప్రత్యక్షంగా చూస్తున్నా: పవన్
ఏపీ సీఎం చంద్రబాబు అనుభవం.. విజన్‌పై తరచుగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 20 March 2026 10:40 PM ISTఏపీ సీఎం చంద్రబాబు అనుభవం.. విజన్‌పై తరచుగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని.. మరో 15 ఏళ్లపాటు కలిసే ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని కూడా ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో ఉగాదిని పురస్కరించుకుని మరోసారి పవన్ కల్యాణ్.. చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు అనుభవాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉగాదిని పురస్క రించుకుని 10060 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. దీనిని సీఎం చంద్రబాబు స్వయంగా ఉగాది రోజు సాయంత్రం విడుదల చేశారు. విడతల వారీగా.. ఈ ఏడాది మే - అక్టోబరు మధ్య కాలంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో విద్యాశాఖ నుంచి హోం శాఖ వరకు వేలాది ఉద్యోగాలు ఉన్నాయి. ఇక, నుంచి వచ్చే ప్రతి ఉగాదికీ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ నిరుద్యోగులకు శుభాకాంక్షలు చెప్పారు. యువతకు తమ కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని పేర్కొన్నారు. 10 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇదంతా సీఎం చంద్రబాబు దార్శనిక దూరదృష్టకి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆయన అనుభవాన్ని రంగరించి.. రాష్ట్రాన్ని సరైన దిశలో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అనుభవాన్ని తాను ప్రత్యక్షంగా మరోసారి వీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
సీఎం ఏమన్నారంటే..
కూటమి ప్రభుత్వం ``జాబ్ ఫస్ట్`` నినాదంతో ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. నిరు ద్యోగులకు భరోసా కల్పిస్తోందన్నారు. ఒకవైపు ఉపాధి, మరో వైపు ఉద్యోగాల కల్పనతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ఇప్పటి వరకు 30 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని.. ఇప్పుడు మరో 10 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నామని వివరించారు. నిరుద్యోగులు బాగా చదివి ప్రిపేర్ అయ్యేందుకు సరిపోయేలా ఈ క్యాలెండర్‌ను రూపొందించామన్నారు. ప్రతి ఉగాదికీ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్టు వివరించారు.
