Begin typing your search above and press return to search.

మంత్రి నారాయ‌ణ మార్కులు ఓకే.. కానీ..!

మంత్రి పొంగూరు నారాయణపై సీఎం చంద్ర‌బాబుకు భారీ ఆశ‌లు, ఆకాంక్షలు ఉన్నాయి.

By:  Garuda Media   |   26 Sept 2026 7:00 AM IST
మంత్రి నారాయ‌ణ మార్కులు ఓకే.. కానీ..!
X

మంత్రి పొంగూరు నారాయణపై సీఎం చంద్ర‌బాబుకు భారీ ఆశ‌లు, ఆకాంక్షలు ఉన్నాయి. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ బాధ్యతలను ఆయ‌నే నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో విశ్వసనీయ నేతగా ఉన్న ఆయన పనితీరుపై రాజకీయ వర్గాలలో సానుకూల అభిప్రాయాలు ఉన్నాయి. మంత్రి నారాయణ ప్రధాన పనితీరును గ‌మ‌నిస్తే.. రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై ఆయ‌న మ‌న‌సు పెట్టారు. చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు.

అమరావతి రాజధాని పనులను వేగవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనం, సచివాలయం, ప్రభుత్వ అధికారుల నివాసాల నిర్మాణ పనుల పురోగతిపై నిరంతరం ఉన్నత స్థాయి సమీక్షలు జరుపుతున్నారు. ముఖ్యంగా.. భూ సమీకరణ విష‌యంలో రైతుల‌ను ఒప్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. అమరావతి రెండో దశ భూ సమీకరణకు సంబంధించి రైతులకు లబ్ధి చేకూర్చేలా, ముఖ్యంగా ఎకరా లోపు డ్రై లేదా జరీబు భూములు ఇచ్చిన రైతులకు కౌలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

ఇక‌, మునిసిప‌ల్ శాఖ మంత్రిగా.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో చెత్త, వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడానికి చర్యలు చేపట్టారు. వివిధ నగరాలలో లక్షలాది టన్నుల వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించే ప్రక్రియను పర్యవే క్షిస్తున్నారు.మంత్రిగా ఆయ‌న ప‌నితీరుకు చంద్ర‌బాబు వంద శాతం మార్కులు వేస్తున్నారు. కానీ, రాజ‌కీయంగా మాత్రం మంత్రి ఇంకా పుంజుకోవాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీ రాజ‌కీయాలు మంత్రి వ్య‌వ‌హార శైలికి భిన్నంగా ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇదే స‌మ‌యంలో మంత్రిగా నారాయ‌ణ‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు కూడా చేస్తున్న ప‌రిస్థితి ఉంది. వ్యర్థాల నిర్వహణ, ఇతర మున్సిపల్ వ్యవహారాలలో కొన్ని ఆరోపణలు చేసింది. వీటిని స‌మ‌ర్ధవంతంగా తిప్పికొట్టేందుకు మంత్రి పెద్ద‌గా చొర‌వ చూప‌లేక పోతున్నారు. సౌమ్యుడు, మాస్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ జోరు పెరుగుతోంది. అలాగే, రాజధాని పనుల భారీ లక్ష్యాలను అనుకున్న సమయానికి పూర్తి చేయడం ఇప్పుడు నారాయ‌ణ‌కు పెద్ద స‌వాల్‌గా మారింది.