Begin typing your search above and press return to search.

ఎల్ నినో ఎఫెక్ట్...వరికి గుడ్ బై !

ఏపీ మీద ఎల్ నినో ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఎవరూ చెప్పాల్సిన పని లేదు, ఏ వాతావరణ నిపుణుడు విశ్లేషించాల్సిన అవసరం అంతకంటే లేదు.

By:  Satya P   |   18 Aug 2026 9:31 AM IST
ఎల్ నినో ఎఫెక్ట్...వరికి గుడ్ బై !
X

ఏపీ మీద ఎల్ నినో ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఎవరూ చెప్పాల్సిన పని లేదు, ఏ వాతావరణ నిపుణుడు విశ్లేషించాల్సిన అవసరం అంతకంటే లేదు. కారు మబ్బులు కమ్ముకున్నా వాటి నుంచి నీటి చుక్క జాలు వారడం లేదు, అంతలా వాటిని విచ్చిన్నం చేస్తూ ఎల్ నినో పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. దాంతో సాగు చేసే రైతాంగం కృంగిపోతూంటే తాగు నీటికి కూడా కడగండ్లు పడుతూ జనాలు గోడు పెడుతునారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాల తొలి రోజునే ఎల్ నినో ప్రభావంతో పాటు ఏపీలో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ ఏ ష్తాయిలో పడింది అన్న దాని మీద సుదీర్ఘంగా చర్చించింది.

వరి సాగు చేయవద్దు

ఇక ఈ అంశం మీద మాట్లాడిన చంద్రబాబు ఎల్‌నినో ప్రభావంతో ఏపీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రైతులు పంటల ఎంపిక నీటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంటలకు ఆర్థిక రక్షణ ఉండాలంటే బీమా నమోదు చేయించుకోవాలని కోరారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వరి సాగు చేయవద్దని ఉద్యాన, వర్షాభావ పంటలను రక్షించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను బాబు కోరడం విశేషం. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. సాధారణ వర్షపాతం కంటే తీవ్రమైన లోటు కనిపిస్తోందని చెప్పారు. 2026 జూన్‌-డిసెంబర్‌ మధ్య 867 మిల్లీ మీటర్లు వర్షపాతం పడాల్సి ఉండగా 557 మిల్లీ మీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పారు. జులైలో కొన్ని జిల్లాల్లో 68 శాతం లోటు వర్షపాతం నమోదైందని ఆగస్టు, సెప్టెంబర్‌లో 35 శాతం చొప్పున, అక్టోబర్‌లో 25 శాతం, నవంబర్‌లో 20 శాతం లోటు ఉండవచ్చన్నారు. డిసెంబర్‌లో మాత్రం ఒక శాతం అదనపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని బాబు వివరించారు.

నీరు అడుగంటుతోంది :

ఏపీలో వివిధ బేసిన్లలో జలాల లభ్యత తగ్గిపోతోందని బాబు తెలిపారు. ప్రాజెక్టులు రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోందన్నారు. శ్రీశైలానికి 753 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా ఈసారి 214 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రిజర్వాయర్లు నిండిన తర్వాతే మన రాష్ట్రానికి నీరు వస్తుందని దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీటి రాక తగ్గుతోందని చెప్పారు. గోదావరి బేసిన్‌లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందన్నారు. కాటన్‌ బ్యారేజీకి 2,557 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా 1,071 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయని బాబు చెప్పారు. కృష్ణాతో పోలిస్తే గోదావరిలో కొంత మేర నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని అందుకే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని వివరించారు. గత రెండేళ్లలో సమర్థ నీటి నిర్వహణతో సుమారు 552 టీఎంసీల నీటిని పొదుపు చేయగలిగామని బాబు తెలిపారు.

అందుబాటు ఉన్నది అదే :

ఇక ఏపీలో ప్రస్తుతం ప్రధాన రిజర్వాయర్లలో 586 టీఎంసీల నీరు ఉందని భూగర్భజల మట్టాలు కూడా తగ్గుతున్నాయని చెప్పారు. గోదావరి బేసిన్‌లో తప్ప ఎక్కడ పంటలు వేసినా ఇబ్బందులు తప్పవు అని బాబు రైతులకు హెచ్చరించారు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించి సహకరించాలని ఆయన కోరారు. కృష్ణా, పెన్నా బేసిన్లలో నీటి లభ్యత తక్కువగా ఉంటుందని బాబు తెలిపారు. గోదావరిలో కొంత మేర పరిస్థితి బాగున్నా అక్కడ కూడా సమర్థ నీటి నిర్వహణ అవసరమన్నారు. పులిచింతలలో నీళ్లు అడుగంటిపోయాయని గోదావరి జలాలు నిలిచిపోతే ఇబ్బందులు వస్తాయని అందువల్ల . కృష్ణాలో వరి వేయొద్దు అని బాబు స్పష్టం చేశారు.

ఏపీలో అతి తక్కువగా :

ఇక దేశ సగటుతో పోలిస్తే ఏపీకి నాలుగు రెట్లు తక్కువ వర్షపాతం పడుతోందని బాబు వివరించారు. నీటి నిర్వహణతో కొంత మేర పంటలను కాపాడుతున్నప్పటికీ పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. వరి విస్తీర్ణం 1.14 లక్షల హెక్టార్ల మేర తగ్గిందని, పప్పుధాన్యాలు మినహా మొక్కజొన్న, వేరుశనగ, చిరుధాన్యాల విస్తీర్ణం కూడా తగ్గిందని ఆయన లెక్క చెప్పారు. ఈ ఏడాది ఎల్‌నినోను ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వచ్చినా శాశ్వతంగా ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలని బాబు సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించడం, సరైన పంటలను ఎంచుకోవడం ప్రతి పంటకు బీమా చేయించడం, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ప్రతి ఒక్కరూ సంకల్పంగా తీసుకోవాలని చంద్రబాబు కోరారు. మొత్తానికి చూస్తే వరి పంట ఈసారి వేయవద్దనే సందేశం ప్రభుత్వం ఇస్తోంది. వర్షాభావ పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.