బాబు బుజ్జగింపులే తమ్ముళ్లకు వజ్రాయుధాలు!
రౌతు కొద్దీ గుర్రం! అన్నారు పెద్దలు. నడిపించేవారు.. ఉదాసీనంగా ఉన్నా.. దయ, జాలి వంటివి చూపించినా.. గుర్రం తన ఇష్టానుసారంగానే నడుస్తుంది.
By: Garuda Media | 23 Oct 2025 8:42 PM ISTరౌతు కొద్దీ గుర్రం! అన్నారు పెద్దలు. నడిపించేవారు.. ఉదాసీనంగా ఉన్నా.. దయ, జాలి వంటివి చూపించినా.. గుర్రం తన ఇష్టానుసారంగానే నడుస్తుంది. ఇప్పుడు టీడీపీలోనూ ఎమ్మెల్యేలు అలానే తయారయ్యా రు. పోనీలే.. పోనీలే.. అంటూ.. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తమ్ముళ్ల విషయంలో జాలి చూస్తుండ డంతో.. ఎమ్మెల్యేలు నెత్తినెక్కి నాట్యం చేస్తున్నారు. 134 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు.
వీరిలో 120 మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. వీరిలోనూ 25 మందిదాకా ఎన్నారైలతో సంబంధాలు, పరిచయాలు ఉన్న వారు ఉన్నారు. ఇక, భారీ పెట్టుబడి దారులు.. భారీ వ్యాపారాలు చేసేవారు.. డాన్లు కూడా ఈ పార్టీలో ఉన్నారు. కానీ.. ఒక్కరైనా ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు చెబుతున్న పీ-4లో కానీ.. పెట్టుబడులను ఆకర్షించడంలో కానీ.. ముందుకు వచ్చారా? అంటే.. లేదన్న సమాధానమే వినిపిస్తోంది. పోనీ.. తీసుకురాలేకపోతే పోయారు.. పరుగులు పెడుతున్న ప్రభుత్వాన్ని మాత్రం ఇరుకున పెడుతున్నా రు.
సీఎం చంద్రబాబు ఒకవైపు పెట్టుబడుల వేట అంటూ.. వయసు ను కూడా మరిచిపోయి.. విదేశీ బాట పట్టారు. పెట్టుబడుల కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేయాలి? కనీసంలో కనీసం.. రాష్ట్రంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కానీ, వారే ఇప్పుడు ఇబ్బందులు సృష్టిస్తూ.. సర్కారుకు కంట్లోనలుసుగా మారారు. ఒకరని ఏముంది.. చాలా మంది నాయకులు దారి తప్పి.. సొంత వ్యవహారాలు.. సొంత ఇగోలతో పార్టీని.. ప్రభుత్వాన్ని కూడా రోడ్డుకు లాగుతున్నారు.
తాజాగా వెలుగుచూసిన శ్రీకాళహస్తి, తిరువూరు, కడప, తాడిపత్రి, అనంతపురం అర్బన్, పల్నాడులోని మూడు నియోజకవర్గాలు సహా 20-30 నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు మాత్రమే వివాదం కాదు. గత ఏడాది కాలంగా వివాదంగానే ఉంది. వారిని అప్పటి నుంచి చంద్రబాబు బుజ్జగిస్తూనే ఉన్నారు. నడత మార్చుకోండి అని చెబుతూనే ఉన్నారు. అయినా.. ఎవరూ మార్చుకోకపోగా.. మరింతగా రెచ్చిపోతున్నారు. తాజా పరిణామం.. దీనికి మచ్చతునక. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు కొరడా ఝళిపిస్తే తప్ప.. పార్టీ పరిస్థితి మెరుగు పడే అవకాశం లేదు.
