ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ: ఏం చేస్తున్నారంటే!
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే.. ఆయన క్షణం తీరికలేకుండా అధికారిక కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.
By: Garuda Media | 1 Oct 2025 12:20 PM ISTటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే.. ఆయన క్షణం తీరికలేకుండా అధికారిక కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన చంద్రబాబు.. `పూర్వోదయ పథకం`లో తమను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ ఏడాది వార్షిక బడ్జట్‌లో కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకాన్ని ప్రకటించింది. దీనిలో ఒడిశా, బీహార్, మహారాష్ట్రలను చేర్చింది. దీని కింద 17 వేల కోట్ల రూపాయలను కేటాయించి.. ఆయా రాష్ట్రాలకు మేలు చేయనుంది. అదేసమయంలో ప్రాజెక్టులు కూడా చేపట్టనుంది. దీనిపై చంద్రబాబు తాజాగా కేంద్ర మంత్రితో చర్చించారు.
తమను కూడా పూర్వోదయ పథకంలో భాగస్వాములను చేయాలని.. తద్వారా ఏపీకి మేలు చేయాలని ఆయన కోరారు. ఉత్త రాంధ్ర ప్రాజెక్టులను పరుగులు పెట్టించేందుకు పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని ఆయన సూచించారు. దీనికి మంత్రి నిర్మలా సీతారామన్ సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా సహ కరించాలని చంద్రబాబు విన్నవించారు. వచ్చే బడ్జెట్‌లో కనీసం 5 వేల కోట్ల రూపాయలైనా అమరావతి ప్రాజెక్టుకు కేటాయించా లని కోరారు. వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని.. ఇప్పుడు తాము గాడిలో పెడుతున్నామని గతంలో ఏం జరిగిందో ఆమెకు వివరించారు.
విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆర్థిక మంత్రి నిర్మలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఇప్పటి వరకు వివిధ దేశాలకుచెందిన పలువురు పారిశ్రామిక వేత్తలను ఒప్పించి 9.7 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించామన్నారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. తద్వారా ఏపీకి పెట్టుబడులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కూడా కేంద్రం తరఫున సహకరించాలని విన్నవించారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించిన ఫొటోలను మంత్రికి చూపించా రు. అలానే.. పోలవరం పనులకు సంబంధించి కొట్టుకుపోయిన.. కాఫర్ డ్యామ్‌ను కూడా ఆయన ఫొటోల రూపంలో మంత్రి ముందు ఉంచారు. వచ్చే బడ్జెట్‌లో ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని వివరించారు. చంద్రబాబు విన్నపాలకు మంత్రి సానుకూలంగా స్పందించారు. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్‌మెంటు కోసం చంద్రబాబువేచి చూశారు. అలాగే.. సీఐఐ సదస్సుకు హాజరయ్యారు. పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. నవంబరులో జరిగే పెట్టుబడుల సదస్సుకు వారిని ఆహ్వానించారు.
