వైసీపీ హిట్ -రన్ -హైడ్ ప్లాన్....బాబు డీ కోడ్ చేశారా ?
వైసీపీ మీద ఆయన రెగ్యులర్ కామెంట్స్ చేస్తూనే ఈ కొత్త విధానం వారు అమలు చేస్తున్నారు అని టీడీపీ ఎమ్మెల్యేల ప్రజా ప్రతినిధుల వర్క్ షాప్ లో చెప్పుకొచ్చారు.
By: Satya P | 7 Sept 2026 9:19 PM ISTహిట్ -రన్ -హైడ్ విధానం. ఇది కొత్తగా ఉంది కదా. రాజకీయాల్లో ఈ తరహా ప్లాన్స్ ఉంటాయా. ఉంటే వర్కౌట్ అవుతాయా. ఏమో వైసీపీ విషయంలో ఇదే జరుగుతోందని రాజకీయ చాణక్యుడు చంద్రబాబు అంటున్నారు. వైసీపీ మీద ఆయన రెగ్యులర్ కామెంట్స్ చేస్తూనే ఈ కొత్త విధానం వారు అమలు చేస్తున్నారు అని టీడీపీ ఎమ్మెల్యేల ప్రజా ప్రతినిధుల వర్క్ షాప్ లో చెప్పుకొచ్చారు. దాంతో ఇది చాలా మందికి అర్థం కాలేదు. హిట్ రన్ అన్నది సాధారణంగా రోడ్డు ప్రమాదాల విషయంలో వాడుతారు, ఒకరికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోవడం. ఇక్కడ మరో మాట కూడా వాడారు, హైడ్ అని. అంటే దాక్కోవడం. వైసీపీ చేస్తున్న పని ఇదే అని బాబు ఆ పార్టీ వ్యూహాన్ని మొత్తం ఇలా డీ కోడ్ చేసి మరీ తన పార్టీ వారికి వివరించారు అన్న మాట.
ఇంతకీ ఏమిటిది :
వైసీపీ అయితే అసెంబ్లీకి రావడం లేదు, ముఖాముఖి చర్చలకు ఆస్కారం ఇవ్వడం లేదు, అదే సమయంలో కొన్ని ఇష్యూస్ ని తాను ఎంచుకుని వాటిని జనంలోకి ముమ్మరంగా ప్రచారం చేసి పెడుతోంది. ఆ మీదట తన వాదన నిజమని అనేలా ప్రభావితం చేస్తోంది. ఇక అవతల వారి సవాళ్ళకు కానీ చర్చలకు కానీ ఎక్కడా రియాక్ట్ అవకుండా హైడ్ అవుతోంది అన్నది బాబు విమర్శలకు అర్థం గా చెబుతున్నారు. వైసీపీ గడచిన 26 నెలల కాలంలో కూటమి మీద అనేక విమర్శలు చేసింది. కొన్నింటి విషయంలో ఆందోళనలు నిరసనలు నిర్వహించింది. అయితే వాటికి కూటమి నుంచి జవాబు వెళ్తోంది, కానీ సహజంగా విపక్షానికి ఉండే అడ్వాంటేజ్ వల్ల జనం లోకి వెళ్తోంది అన్నది టీడీపీ అధినాయకత్వం భావనగా ఉంది. ఇక ఏ రకమైన ఆరోపణలు విమర్శలు అయినా అసెంబ్లీ వేదికగా చర్చిస్తే వాస్తవాలు బయటపడతాయి. కానీ ఆ చాన్స్ వైసీపీ ఇవ్వడం లేదు, అసెంబ్లీకే వైసీపీ వెళ్ళడం మానుకుంది. దాంతో హైడ్ అవుతూ వైసీపీ దాక్కుంటోంది అని చంద్రబాబు విమర్శిస్తున్నారు.
లైట్ తీసుకోవద్దు :
వైసీపీ హిట్ రన్ హైడ్ ప్లాన్ ని అమలు చేస్తోంది అని చంద్రబాబు చెబుతూనే పార్టీ నాయకులు ఎవరూ దీనిని లైట్ తీసుకోవద్దని హెచ్చరించారు. ఆ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తోందని దానిని ధీటుగా తిప్పికొట్టాల్సి ఉందని కూడా ఆయన గట్టిగా ఒకటికి పదిసార్లు చెబుతున్నారు. ఏపీలో ఏ మంచి జరిగినా దాని మీద వైసీపీ విమర్శలు చేస్తోంది. కొన్ని సార్లు క్రెడిట్ తమదే అని క్లెయిం చేస్తోందని కూడా బాబు మండిపడ్డారు. వైసీపీవి అన్నీ వక్రీకరణలు అబద్ధపు ప్రచారాలు అని బాబు అంటూ దీనిని జనంలో ఉంచి వాస్తవాలను చెప్పడ్డం ద్వారానే టీడీపీ కూటమి తాము చేసింది ఏంటో చూపించగలుగుతుందని అన్నారు.
సోషల్ మీడియాతో కూడా :
ఇక ఆ మధ్య మోడీ తన పార్టీ వారిని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండమని కోరారు. చంద్రబాబు ఇపుడు అదే మాట చెబుతున్నారు. సోషల్ మీడియాలో పార్టీ నేతలు అంతా యాక్టివ్ గా ఉండాలని ఆయన కోరారు. అక్కడ పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలను తిప్పుకొట్టాలని ఎప్పటికప్పుడు ఇదంతా జరగాలని ఆ విధంగా అప్టూ డేట్ కావాలని ఆయన కోరడం విశేషం. మొత్తం మీద చూస్తే వైసీపీ మాయా యుద్ధం చేస్తోంది అన్న అర్థం వచ్చేలా కూటమి నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎదురు నిలిచి పోరాడకుండా అసెంబ్లీలో చర్చలకు రాకుండా వైసీపీ కొత్త ప్లాన్ తో కార్నర్ చేస్తోంది అని దానిని టార్గెట్ చేసి చేదించాలని తన పార్టీ నాయకులకు బాబు దిశా నిర్దేశం చేశారు అన్న మాట. మరి వైసీపీ హిట్ రన్ హైడ్ అజెండాను సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తోందా, ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నమ్మకం పెట్టుకుందా బాబు చెప్పినట్లుగా వైసీపీ స్ట్రాటజీ ఇదేనా అంటే చూడాల్సిందే మరి.
