Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మీద బాబు పొలిటికల్ టోన్ చేంజ్ ?

ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ మీద తాజాగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.

By:  Satya P   |   5 Oct 2026 12:32 AM IST
కాంగ్రెస్ మీద బాబు పొలిటికల్ టోన్ చేంజ్ ?
X

ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ మీద తాజాగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఏపీకి విభజన రూపంలో కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది అని బాబు విమర్శించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఏపీని అనాధగా చేస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని విధాలుగా ఏపీని ఆదుకుంటోంది అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి రాజధాని లేకుండా :

ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజన చేసిన తీరుని మరోసారి చంద్రబాబు తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎలాంటి రాజధాని లేకుండా చేశారు అని నిందించారు. ఏపీకి సరైన వనరులు కేటాయించకుండా అశాస్త్రీయంగా విభజించి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాల్లోకి నెట్టేసిందని చంద్రబాబు మండిపడ్డారు. అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంతో కలిసి టీడీపీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లుగా బాబు గుర్తు చేశారు.

కాంగ్రెస్ ని ఎందుకంటే :

ఈ మధ్య కాలంలో టీడీపీ కాంగ్రెస్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, ఏపీ వరకూ చూస్తే కాంగ్రెస్ పెద్దగా లేదు అన్నది తెలిసిందే. ఓటు షేర్ కూడా ఒకటి రెండు శాతం లోపుగానే ఉంది. దాంతో వైసీపీ మీదనే టీడీపీ తన ఫోకస్ పెడుతూ వస్తోంది. అయితే బుర్రిపాలెంలో బాబు పొలిటికల్ టోన్ మార్చేశారు. వైసీపీని విమర్శిస్తూనే కాంగ్రెస్ ని కూడా కలిపి మరీ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధానంగా వైసీపీనే లక్ష్యంగా చేసుకున్నప్పటికీ జాతీయ కాంగ్రెస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం పట్ల చర్చ సాగుతోంది.

ఊహాగానాల నేపథ్యం :

జాతీయ స్థాయిలో చూస్తే రాజకీయంగా మార్పులు సంభవిస్తున్నాయి. కాంగ్రెస్ ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తోంది. ఇతర పార్టీలతో కలసి 2029 ఎన్నికల నాటికి కేంద్రంలో ఎన్డీయేని దించాలని పట్టుదల చూపిస్తోంది. ఇక గతంలో కాంగ్రెస్ ని వీడిన నేతలను వారు పెట్టిన ప్రాంతీయ పార్టీలను మిత్రులుగా చేసుకోవాలని కూడా కాంగ్రెస్ చూస్తోంది అన్న ప్రచారం ఉంది. ఆ విధంగా దేశవ్యాప్తంగా బలం పెంచుకుంటే తప్ప ఎన్డీయేను ఓడించలేమన్నది కాంగ్రెస్ అంచనాగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ కాంగ్రెస్ తో కలసి పనిచేస్తుందని ఊహాగానాలు కూడ చెలరేగుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇండియా కూటమి వైపుగా వైసీపీ మొగ్గు చూపిస్తుందని ప్రచారం అయితే గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో వామపక్షాలతో వైసీపీ పనిచేయాలని అనుకోవడం కూడా ప్రాధమికమైన అడుగుగా కూడా భావిస్తున్నారు. దాంతో ఏపీలో రాజకీయం కూడా మారుతోందని అంటున్నారు.

కాంగ్రెస్ విభజన పాపం :

ఇక కాంగ్రెస్ ని 2014 ఎన్నికల్లో టీడీపీ అలాగే బీజేపీ జనసేన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చాయి. విభజనతో ఏపీ గొంతు కోసిన పార్టీగా జనం ముందు నిలబెట్టాయి. ఇక 2019, 2024 ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ రాజకీయం సాగించాయి. అయితే 2029లో మాత్రం పొత్తులు ఎత్తులు అన్నీ మారుతాయని ఊహాగానాల నేపధ్యంలోనే బాబు కాంగ్రెస్ ని గట్టిగా టార్గెట్ చేశారు అని అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమే అని రానున్న రోజులలో కాంగ్రెస్ ని కూడా వైసీపీతో పాటుగా విమర్శించే విధంగా వ్యూహ రచన ఉంటుందని అంటున్నారు. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో వైసీపీ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకున్నా ఆ ప్రభావం ఏపీ లో పెద్దగా చూపించకుండా ఉండేలా విభజన గాయాలని మరోసారి జనం ముందు పెట్టేలా టీడీపీ ఎత్తుగడలు సాగుతాయని అంటున్నారు.