Begin typing your search above and press return to search.

త‌ల్ల‌కింద‌లుగా త‌ప‌స్సు చేసినా.. జ‌గ‌న్ స‌క్సెస్ కాడు: చంద్ర‌బాబు

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో ప్ర‌భుత్వం దూకుడుగా ఉన్న నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల‌ను ఏదో ఒక ర‌కంగా అడ్డుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు

By:  Garuda Media   |   28 Aug 2026 7:23 PM IST
త‌ల్ల‌కింద‌లుగా త‌ప‌స్సు చేసినా.. జ‌గ‌న్ స‌క్సెస్ కాడు:  చంద్ర‌బాబు
X

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో ప్ర‌భుత్వం దూకుడుగా ఉన్న నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల‌ను ఏదో ఒక ర‌కంగా అడ్డుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ ఎన్నిక‌లు వాయిదా ప‌డితే.. త‌న‌కు, త‌న పార్టీకి ఏదో మేలు జ‌రుగుతుంద‌ని అనుకుంటున్నార‌ని.. కానీ, జ‌గ‌న్ త‌ల్ల‌కింద‌లుగా త‌ప‌స్సు చేసినా.. ఏమీ స‌క్సెస్ కాలేడ‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

తాజాగా మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర‌ కార్యాల‌యానికి వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబు.. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా స్థానిక ఎన్నిక‌ల విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. తాము అన్నీ రెడీ చేసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. స్థానిక ఎన్నిక‌ల‌ను అక్టోబ‌రులోగా నిర్వ‌హించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. అలా చేయ‌క‌పోతే.. కేంద్రం నుంచి వ‌చ్చే 16వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయ‌ని వెల్ల‌డించారు. కానీ.. ఈ విష‌యం తెలిసి కూడా.. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా గొడ్డ‌లి పార్టీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు.

``ఇప్పుడు ఏడో జ‌రిగిపోయింద‌ని.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని హైకోర్టుకు వెళ్లారు. ఎందుకు వాయిదా వేయాల‌ని కోర్టు ప్ర‌శ్నించింది. ఏం చెబుతారో చూడాలి. మేం బాధ్య‌త‌గా ప‌నిచేస్తున్నాం. ఈ ఏడాది జ‌న‌వ‌రి 1వ తేదీనాటికి ఉన్న ఓట‌రు జాబితా ప్ర‌కారం ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఒక‌వేళ వాయిదా ప‌డినా.. దానివ‌ల్ల గొడ్డ‌లి పార్టీకి ఏదో మేలు జ‌రుగుతుంద‌ని అనుకుంటే క‌లే. గొడ్డ‌లిపార్టీ అధినేత త‌ల్ల‌కిందులుగా త‌ప‌స్సు చేసినా.. ఏమీ కాదు.`` అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

బీసీల‌కు మేలు చేసిన పార్టీగా టీడీపీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇప్పుడు తానేదో ఊడ‌బొడిచిన‌ట్టు బీసీలకు మేలు చేశాన‌ని గొడ్డ‌లి పార్టీ నేత చెబుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా బీసీల‌కు మేలు చేసింది టీడీపీనేన‌ని అన్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం ద్వారా బీసీల ఆత్మ‌గౌర వాన్ని నిల‌బెడుతున్నామ‌న్నారు. దీనిపై కూడా కొంద‌రు కోర్టుకు వెళ్లార‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ.. తాము 34 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేసేందుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు.

చేసిన మేలు..

ప్ర‌జ‌ల‌కు అన్ని విధాలా మేలు చేస్తున్నామ‌ని.. ఈ విష‌యం ప్ర‌జ‌ల‌కు కూడా తెలుసున‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఉచిత బ‌స్సును తొలిసారి ఏపీలో ప్ర‌వేశ పెట్టి మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఇస్తున్నామ‌న్నారు. పింఛ‌న్ల‌ను కూడా ఠంచ‌నుగా ఇస్తున్నామ‌ని.. ఇంత మేలు చేసే కూట‌మి ప్ర‌భుత్వంవైపే ప్ర‌జ‌లు ఉంటార‌ని.. దీనిలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. కూట‌మి పార్టీల మ‌ధ్య ఐక్య‌త బాగానే ఉంద‌ని.. లేద‌నే వారు.. త‌మ ఆరోగ్యాన్ని ఒక‌సారి పరీక్షించుకోవాల‌ని చ‌మ‌త్క‌రించారు.