బొత్స ఇలాకాకు చంద్రబాబు.. 20 నెలల తర్వాత ఎలా ఉందంటే..?
నెలనెల సామాజిక పింఛన్లు పంపిణీలో భాగంగా నిర్వహిస్తున్న పేదల సేవలో కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి వెళుతున్నారు.
By: Tupaki Political Desk | 27 Feb 2026 9:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నెలనెల సామాజిక పింఛన్లు పంపిణీలో భాగంగా నిర్వహిస్తున్న పేదల సేవలో కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి వెళుతున్నారు. మార్చి 1వ తేదీన పంపిణీ చేయాల్సి ఉండగా, ఆ రోజు ఆదివారం కావడంతో ఫిబ్రవరి చివరి రోజునే పెన్షన్ల జాతరకు చంద్రబాబు తెరతీశారు. అయితే ఈ నెల ఆయన చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకోవడమే ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే చీపురుపల్లి విపక్ష నేత బొత్సకు సొంత స్థానం కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
గత ఎన్నికల సమయంలో లక్కీగా చీపురుపల్లి టికెట్ సాధించిన కళావెంకటరావు కూటమి హవాలో భారీ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం ఆయనకు పూర్తిగా కొత్త అయినప్పటికీ గత 20 నెలలుగా అందుబాటులో ఉంటూ ప్రభుత్వం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై అధిష్టానం సంతృప్తికరంగా లేదన్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. సిట్టింగు ఎమ్మెల్యే కళా సమర్థతపై పార్టీ పెద్దలకు సదాభిప్రాయం ఉన్నప్పటికీ ఆయన నియోజకవర్గ బాధ్యతలను కుమారుడు రామమల్లిక్ నాయుడికి అప్పగించడం, ఎమ్మెల్యేకు బదులుగా ఆయన వ్యక్తిగత సహాయ సిబ్బంది ఎక్కువగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తలదూర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
విపక్ష నేత బొత్సకు బలమైన పట్టు ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కళా వెంకటరావు అందుకు తగ్గ స్థాయిలో పనిచేయలేకపోతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా కళా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఇప్పటికే బొత్స హవా తగ్గలేదని అంటున్నారు. ప్రధానంగా నియోజకవర్గానికి ఆయువు పట్టువంటి చీపురుపల్లి, గరివిడి మేజర్ పంచాయతీల్లో సరైన నాయకత్వం తయారు చేసుకోలేకపోయారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే, అధికార టీడీపీకి దీటైన అభ్యర్థి లభించే పరిస్థితి లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీకి సమర్థవంతమైన నాయకత్వం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేడర్ బలంగా ఉన్నప్పటికీ పార్టీని సరైన రీతిలో నడపలేకపోతున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే కళా వయోభారంతో చురుకుగా వ్యవహరించలేకపోవడం, ఆయన కుమారుడు విపక్షాన్ని ఎదుర్కొనే రీతిలో స్పందించలేకపోవడం వల్ల పార్టీ కేడర్ ఇబ్బందులు ఎదుర్కోంటోందని అంటున్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది అన్నీతానై వ్యవహరిస్తూ పార్టీ కేడర్ ను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్లినట్లు చెబుతున్నారు. కళా వ్యక్తిగత సహాయకుల వల్లే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతం కళాకు పోటీగా మరో వర్గం తయారయ్యే పరిస్థితి లేకపోయినా, ఆయన కుటుంబానికి చెందిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం విమర్శలకు తావిస్తోందని చెబుతున్నారు. యువకుడైన నాగార్జున ఐదేళ్ల వైసీపీ పాలనలో చీపురుపల్లి ఇంచార్జిగా సమర్థంగా పనిచేసి బొత్సను ఢీకొన్నారని, ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తున్నారని కేడర్ లో అసంతృప్తి కనిపిస్తోంది. ఈ విషయాలు అన్నీ పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయని చెబుతున్నారు. సీఎం చంద్రబాబుకు పార్టీ కార్యాలయం నుంచి దీనిపై ప్రత్యేక నోట్ అందిందని, చీపురుపల్లి పర్యటనలో ఈ అంశాలపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
బొత్సను ఢీకొట్టాలంటే నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేయడంతోపాటు చీపురుపల్లి, గరివిడి వంటి ప్రధాన పట్టణాల్లో నాయకత్వాన్ని తయారు చేసుకోవాల్సివుందని అంటున్నారు. 20 నెలల పాలనలో ఎమ్మెల్యే కళా ఈ విషయంలో విఫలమయ్యారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి పరిస్థితుల చీపురుపల్లిలో అనూహ్య విజయం సాధించామని, కానీ పరిస్థితి ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో బొత్సను ఆయన అనుచరులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదంటున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు చీపురుపల్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
