విశాఖ ఎఫెక్ట్: బాబు విజయోత్సవం రద్దు!
ఈ క్రమంలోనే తిరుపతి జిల్లాలోని దామినేడు ప్రాంతంలో భారీ ఎత్తున విజయోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు.
By: Garuda Media | 9 Jun 2026 10:08 AM ISTఅంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న కూటమి సర్కారు విజయోత్సవ సభను సీఎం చంద్రబాబు రద్దు చేశారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ద గంటల్లోనే తిరుపతి వేదికగా.. విజయోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు చేసిన మేలు.. సంక్షేమ కార్యక్రమాలు, కూటమి పార్టీల ఐక్యత, కేంద్రం నుంచి జరుగుతున్న లబ్ధి వంటి వాటిని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే తిరుపతి జిల్లాలోని దామినేడు ప్రాంతంలో భారీ ఎత్తున విజయోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు బీజేపీ, జనసేన పార్టీల నుంచి కూడా నాయకులను ఆహ్వానించారు. అయితే.. సోమవారం సాయంత్రం విశాఖపట్నం లోని స్టీల్ ప్లాంటులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని 8 మంది కార్మికులు ఆహుతయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికర వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో దామినేడు సభను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్‌లతో చంద్రబాబు ఫోన్‌లోనే చర్చించారు. ఆ తర్వాత తిరుపతి జిల్లా అధికారులకు సమాచారం అందించారు. దీంతో సభ రద్దయింది.
మహానాడు కూడా..
ఇక, గత నెలలో మహానాడు కూడా ఇలానే హఠాత్తుగా రద్దయింది. మహానాడు కోసం నెల్లూరును ఎంచుకుని రూ.కోట్ల మేరకు ఖర్చు చేసి.. 28 ఎకరాల భూములను చదును చేశారు. వంటవార్పులకు కూడా అడ్వాన్సులు ఇచ్చారు. ఇక, తమ్ముళ్లు కూడా.. ఉత్సాహంగా మహానాడులో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. కానీ, ఇంతలోనే అంటే.. మహానాడు కు ఖచ్చితంగా రెండు రోజుల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వచ్చారు. ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం పొదుపు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో మహానాడును కూడా అప్పట్లో నిలిపివేసి.. ఆన్‌లైన్‌లో నిర్వహించారు.
