బీసీలకు 34 శాతం రిజర్వేషన్.. చంద్రబాబు కీలక నిర్ణయం
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెరగనున్నాయా? స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే ఔను అనే సమాధానమే వినిపిస్తోంది.
By: Tupaki Political Desk | 25 Feb 2026 10:02 PM ISTరాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెరగనున్నాయా? స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే ఔను అనే సమాధానమే వినిపిస్తోంది. పెంచిన రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు బీసీ రిజర్వేషన్ల అంశంపై డెడికేటెడ్ కమిషన్ ను నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలోని ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సివుంటుందని చెబుతున్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచి రాజకీయంగా ప్రయోజనం పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
చంద్రబాబు 3.0 సర్కారులో బీసీ రిజర్వేషన్లు 34 శాతం ఉండేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వులతో బీసీ రిజర్వేషన్లను తగ్గించాల్సివచ్చిందని చెబుతున్నారు. 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించడం బీసీలలో అసంతృప్తికి కారణమైందని అంటున్నారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో రిజర్వేషన్లను 50 శాతం మించి అమలు చేయలేని పరిస్థితుల్లో బీసీ కోటా తగ్గించాల్సివచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తన ముందు ఉన్న అవకాశాలను వినియోగించుకోలేకపోయిందని, అందుకే బీసీ కోటాను తగ్గించేసిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఇక తాజాగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వేషన్లపై కీలక అడుగులు వేస్తున్నారని అంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తగ్గించిన రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధించేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. గతంలో ఉన్న బీసీ కమిషన్ గడువు ముగియడంతో, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో కొత్త కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా బీసీల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని సిఫార్సు చేయాల్సివుంది.
వచ్చే నెలతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఆ తర్వాత రెండు నెలలకు మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్, పురపాలక సంస్థల పదవీకాలం ముగియనుంది. వీటికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడం తప్పనిసరి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలంటే 'ట్రిపుల్ టెస్ట్' పాటించాలని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా వెనుకబాటుతనాన్ని నిరూపించే గణాంకాలను సేకరించాలి. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత ప్రభుత్వం తగ్గించిన 34 శాతం బీసీ రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. దీనికి చట్టబద్ధమైన రక్షణ ఉండాలంటే కమిషన్ నివేదిక అత్యవసరమని అంటున్నారు. దీంతో నెలన్నర వ్యవధిలో బీసీ కమిషన్ నివేదిక తీసుకుని బీసీ కోటాను తిరిగి 34 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిద్వారా రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీలను ఆకట్టుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు.
