మరో ఎన్నికల హామీ అమలు దిశగా చంద్రబాబు.. కేంద్రం నిర్ణయమే కీలకం
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపి బీసీ కమిషన్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 17 Feb 2026 4:00 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు తన మరో ఎన్నికల హామీ అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అవడంతో ప్రస్తుతం బీజేపీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దేశంలోనే తొలిసారి బీసీల రక్షణ చట్టానికి అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. బీసీలపై దాడులను అరికట్టే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి న్యాయ సలహా అవసరం అవడంతో రాష్ట్రస్థాయిలో నిపుణులతో చర్చలు పూర్తి చేశారని అంటున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపి బీసీ కమిషన్ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ చట్టం చేస్తామని ప్రకటించారు. 20 నెలల అనంతరం ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గ ఉప సంఘం రూపొందించిన ముసాయిదాను సిద్ధం చేశారని అంటున్నారు. దీని ప్రకారం భవిష్యత్తులో బీసీలపై దాడులు చేస్తే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ బిల్లు న్యాయశాఖ పరిశీలనలో ఉందని చెబుతున్నారు. న్యాయశాఖ ఆమోదం పొందిన తర్వాత కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది.
బీసీల చట్టానికి అసెంబ్లీ ఆమోదముద్ర వేస్తే దేశంలో ఈ తరహా చట్టం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించనుంది. అయితే చట్టం రూపకల్పనలో కొన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురవుతున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సమస్యలను అధిగమించేందుకు జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు ముసాయిదాను పంపాలని ప్రభుత్వం యోచిస్తోందని అంటున్నారు. దీంతో బిల్లు అసెంబ్లీ ముందుకు రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. తాజా అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో జాతీయ బీసీ కమిషన్ పరిశీలన అనంతరం కేబినెట్ లో ఆమెదించి ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చర్చించుకుంటున్నారు.
బీసీ రిజర్వేషన్లు, ఇతరత్రా అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కేంద్రం అనుమతి, ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సివుందని అంటున్నారు. ఇక ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే బీసీలపై దాడులు, వేధింపుల నేరానికి జైలులో పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా బీసీల కేసులపై ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక కేసు పెట్టిన తర్వాత చార్జిషీటు దాఖలు చేసిన రెండు నెలల్లోనే విచారణ పూర్తి చేసి కేసు పరిష్కరించాలన్న నిబంధన ఆసక్తి రేపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని చెబుతున్నారు.
