ఎమ్మెల్యేల గురించి కేబినెట్ లో బాబు...సీరియస్ గానే !
అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవరిస్తున్నారు అని చంద్రబాబు కేబినెట్ లో మంత్రులతో ప్రస్తావించారు అని అంటున్నారు.
By: Satya P | 3 Oct 2025 8:35 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విషయం మీద అయినా పక్కాగా ఉంటారు ప్రతీ దాని మీద గట్టిగానే ఆలోచన చేస్తారు. కొన్ని విషయాల్లో ఆయన ఫోకస్ చేస్తూనే ఉంటారు. తాను అనుకున్న విధంగా జరగకపోతే మాత్రం ఆయన ఏ మాత్రం ఊరుకోరు. ఒక వైపు రాష్ట్రం బాధ్యతలు ప్రాజెక్టులు అలాగే అనేక కష్టాలు నష్టాలు మరో వైపు చూస్తే పార్టీ బాధ్యతలు ఇలా బాబు చాలా చాలా టైం కేటాయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పటికపుడు చెక్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల వర్షాకాల సమావేశాల సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అని ప్రచారం సాగింది. అయితే అక్కడితో ఆ ఇష్యూ అయిపోలేదు. బాబు మనసులో అది ఉంటూనే ఉంది అనడానికి శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బాబు చేసిన కీలక వ్యాఖ్యలుగా చూడాల్సి ఉంది.
ఇష్టానుసారంగా అంటూ :
అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవరిస్తున్నారు అని చంద్రబాబు కేబినెట్ లో మంత్రులతో ప్రస్తావించారు అని అంటున్నారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరులో అది లేదని కూడా అన్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా ఇంచార్జి మంత్రులే బాధ్యత తీసుకోవాలని ఇక మీదట అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని పెద్ద బాధ్యతనే పెట్టారు అని అంటున్నారు
విపక్షంగా మారి :
ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విపక్షంగా మారి ప్రభుత్వాన్ని మంత్రులను ప్రశ్నిస్తున్నారు అందులో ప్రజా సమస్యలు ఉన్నా నేరుగా ప్రభుత్వం మీదనే విమర్శలు చేస్తున్నట్లుగా అవి ప్రచారంలోకి వెళ్తున్నాయి. దాంతో కూటమి పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఈ విషయంలో క్లాస్ తీసుకున్నారు అని కూడా వార్తలు వచ్చాయి. ఇక శాసనసభా పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేయాలని అనుకున్నారు అది తరువాత ఎపుడైనా జరగవచ్చు కానీ ఈ లోగానే మంత్రులకు బాబు కీలక సూచనలు చేశారు అని అంటున్నారు. అలాంటి వారిని కంట్రోల్ లో పెట్టాల్సిన బాధ్యత ఇంచార్జి మంత్రులదే అని ఆయన స్పష్టం చేశారు అని అంటున్నారు.
జనాలోకి వేరే సంకేతాలు :
అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పోతే జనంలో తప్పుడు సంకేతాలు ఇస్తుందని బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన ఆ విషయాన్ని ప్రత్యేకంగా కేబినెట్ మీట్ లో కూడా తీసుకుని వచ్చి మరీ మంత్రులకు దీని మీద కీలక సూచనలు చేశారు అని అంటున్నారు. ప్రతీ సారి మంత్రులకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చిన బాబు ఈసారి కేబినెట్ మీటింగులో మాత్రం ఎమ్మెల్యేల తీరు మీద అసెంబ్లీలో కొందరు వ్యవహరిస్తున్న శైలి మీద తన అసంతృప్తిని వ్యక్తం చేసారు అని అంటున్నారు. మరి జిల్లా ఇంచార్జి మంత్రులు ఏ మేరకు ఈ బాధ్యతలు నెరవేరుస్తారు అనేది చూడాల్సి ఉంది. అదే సమయంలో ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఏ తీరుగా వ్యవహరిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.
