Begin typing your search above and press return to search.

చంద్రబాబు చెప్పినట్లే ఆటోడ్రైవర్లకు రూ.15వేలు.. షరతులు వర్తిస్తాయి

చంద్రబాబు ఇచ్చే హామీలు అమలయ్యేనా? అన్న ప్రశ్నను సంధిస్తుంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు.

By:  Garuda Media   |   14 Sept 2025 9:18 AM IST
చంద్రబాబు చెప్పినట్లే ఆటోడ్రైవర్లకు రూ.15వేలు.. షరతులు వర్తిస్తాయి
X

చంద్రబాబు ఇచ్చే హామీలు అమలయ్యేనా? అన్న ప్రశ్నను సంధిస్తుంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో చంద్రబాబు తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. అధికారం చంద్రబాబుకు కొత్త కాకున్నా.. గతంలో ఆయన ప్రభుత్వాలు పని చేసిన దానికి భిన్నంగా ఈసారి ఆయన తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నికల వేళ ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇవ్వటం తెలిసిందే. ఈ హామీని అమలు చేసేందుకు వీలుగా.. తాజాగా ప్రకటన విడుదలైంది. దసరా వేళ.. ఏపీలోని ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాలో రూ.15వేలు చొప్పున జమ చేయనున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు.. ఆటోమిత్ర పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్ల మార్గదర్శకాల్ని విడుదల చేశారు. దీంతో.. చంద్రబాబు మాటంటే మాటే అన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి.

ఇంతకూ ఆటోమిత్ర పథకంలో భాగంగా లబ్థిదారులకు విడుదల చేసిన మార్గదర్శకాల్ని చూస్తే..

- సొంత ఆటో రిక్షా.. మోటార్ క్యాబ్.. మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుంది.

- లబ్థిదారులు సొంత వాహనంతో పాటు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి.

- లబ్థిదారులు తమ వాహనానికి ఏపీ రిజిస్ట్రేషన్.. ఫిట్ నెస్.. టాక్స్ చెల్లింపు ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.

- సరకు రవాణా వాహనాలకు ఈ పథకాన్ని వర్తింపచేయరు

- లబ్థిదారులు ఎవరైనా ఆధార్.. రేషన్ కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

- కుటుంబంలో ఒక వాహనదారుడికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

- లబ్థిదారుల ఎంపిక.. పథకం అమలు కోసం గ్రామ వార్డు సచివాలయాలు.. రవాణా శాఖ పని చేస్తుంది.

- ఈ నెల 17-19 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల్ని స్వీకరిస్తారు

- ఈ నెల 24న దరఖాస్తుల్ని పరిశీలించి లబ్థిదారుల తుదిజాబితా సిద్ధం చేస్తారు.

- అక్టోబరు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందిస్తారు. మిగిలిన వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు.