ఆ శాఖను గాడిలో పెడుతున్న బాబు.. !
ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా సొమ్ములు ఇంకా పెండింగులోనే ఉన్నాయి.
By: Garuda Media | 28 July 2026 8:00 PM ISTరాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అంటే.. తాజాగా చంద్రబాబు లెక్కల ప్రకారమే పెద్దగా బాగోలేదన్న స్పష్టమవుతోంది. ఇటీవల నిర్వహించిన త్రైమాసిక సమీక్షలో చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అధికారులు ఆచి తూచి వ్యవహరించాలని సూచించారు. అదేసమయంలో ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చే విషయాన్ని కూడా పక్కన పెట్టారు. పీ4ను ఎంకరేజ్ చేయాలని పారిశ్రామిక వేత్తలను పట్టుకుని.. వారి ద్వారా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు కొనసాగించాలన్నారు.
ఈ పరిణామాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నది స్పష్టం అవుతోంది. అయితే.. ఇప్పుడు రాష్ట్ర సర్కారు ఏం చేయాలన్నది కీలక అంశం. ఈ వ్యవహారంపై ఆర్థిక శాఖ అధికారులు ప్రభుత్వం ముందు కీలక ప్రతిపాదనలు ఉంచారు. దుబారా వ్యయాన్ని తగ్గించాలన్నది ప్రధాన విషయం. అయితే.. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం చేస్తున్న ఖర్చును దుబారాగా భావించరాదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇతర మార్గాలను అన్వేషించాలన్నారు.
ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్రం ఇవ్వాల్సిన వాటా సొమ్ములు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. దీంతో ఆయా పథకాలు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నది ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్న మాట. దీనిని సీఎం కొంత మేరకు సీరియస్‌గానే తీసుకున్నారు. అయితే.. మరోవైపు.. అప్పులు పెరుగుతుండడాన్ని కూడా ఆయన సీరియస్‌గానే తీసుకుంటున్నా.. తప్పని పరిస్థితి ఏర్పడిందన్న భావన వ్యక్తమవుతోంది.
ఎదురు చూస్తున్న పథకాలు..
మరోవైపు.. కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి రెండు పథకాలను ఇంకా అమలు చేయాల్సి ఉంది. వీటిపై కసరత్తు చేయాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు ఇచ్చే ఆర్థిక సాయంతోపాటు.. ప్రభుత్వం నుంచి రెండు పథకాల కోసం యువత , మహళలు ఎదురు చూస్తున్నారు. కానీ, వాటిని అమలు చేయడం అంత ఈజీకాదని ఆర్థిక శాఖ అధికారులు తేల్చేశారు. దీంతో కాస్ట్ కటింగ్ దిశగా అడుగులు వేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపైనా కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా ఆర్థిక శాఖను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
