2 రోజుల్లో 13.. 18 నెలల్లో 22... ఏపీలో షాకింగ్ ఫిగర్స్!
విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో అద్భుతాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. రెండు రోజుల సదస్సులు అనేక సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి.
By: Raja Ch | 15 Nov 2025 10:00 PM ISTవిశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో అద్భుతాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. రెండు రోజుల సదస్సులు అనేక సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఈ సదస్సుకు మూడు వేల మంది ప్రతినిధులు రావడం హర్షణీయమన్నారు. పెట్టుబడులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.
అవును... ఏపీ ఆర్ధిక రాజధానిగా చెప్పే విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా... ఈ సదస్సులో ఇప్పటివరకూ రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో.. మొతంగా గడిచిన 18 నెలల్లోనే రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. శ్రీసిటీలో మరికొన్ని యూనిట్లను వర్చువల్ గా ప్రారంభించిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... శ్రీసిటీలో 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ఇదే సమయంలో.. త్వరలో శ్రీసిటీకి 6వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని.. ఇక్కడ నుంచే 50 దేశాలకు చెందిన కంపెనీలు పనిచేస్తాయని.. ఫలితంగా సుమారు ఒకటిన్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు!
బ్రూక్ ఫీల్డ్ గ్రూప్ తో ఏపీ ఒప్పందం!:
మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన బ్రూక్ ఫీల్డ్ గ్రూప్ తో ఏపీ ప్రభుత్వం ఒక అవగాహనపై ఒప్పందంపై సంతకం చేసింది. దీన్ని కేవలం పెట్టుబడి అవకాశంగా మాత్రమే చూడకుండా.. రాష్ట్రంలో సహజ వనరులను ఖాళీ చేయకుండా గ్రీన్ ఎనర్జీ ద్వారా డేటా సెంటర్ ను ఎలా నిర్మించొచ్చో తెలుసుకోవడానికి ఒక ప్రధాన అవకాశమని అంటున్నారు. ఈ ఒప్పందంతో ఏపీలో 3 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు కానుంది!
ఏపీకి రేమాండ్.. రూ.1201 కోట్ల పెట్టుబడులు!:
విశాఖలో రెండో రోజు జరుగిన సీఐఐ పెట్టుబడుల సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులను రేమాండ్ గ్రూపు ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు... 2027నాటికి ఈ మూడు ప్రాజెక్టులూ ప్రారంభిస్తామని రేమాండ్ హామీ ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతం మైనీ పాల్గొన్నారు.
21 రోజుల్లోనే అన్ని అనుమతులు!:
ఈ సందర్భంగా... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ సీఐఐ సదస్సులో భాగంగా శుక్రవారం "వారీ" ఛైర్మన్ శ్యాం సుందర్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో... పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యంత అనుకూల ప్రాంతమని ఆయనకు వివరించారు. ఇందులో భాగంగా... సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు ఆపరేటింగ్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
