ఫిబ్రవరి నుంచి ఏపీ అసెంబ్లీ.. కీ పాయింట్స్ ఇవే.. !
ఫిబ్రవరి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఇప్పటికే జరిగి ఉండాల్సింది.
By: Garuda Media | 8 Jan 2026 10:00 PM ISTఫిబ్రవరి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి ఇప్పటికే జరిగి ఉండాల్సింది. కానీ అనివార్య కారణాలవల్ల అసెంబ్లీ సమావేశాలను ఫిబ్రవరి వరకు పొడిగించారు. అయితే ఈ దఫా సుమారు 7 నుంచి పది రోజులపాటు సభల నిర్వహించే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ కలిసి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ దఫా సమావేశాలు కూడా అత్యంత కీలకంగా మారనున్నాయి.
గడిచిన 19 నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా తీసుకు వచ్చిన పెట్టుబడులు వంటి అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పాలనేది సీఎం చంద్రబాబు ప్రధాన ఉద్దేశం. ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయాన్ని కూడా అసెంబ్లీ వేదికగానే ఆయన ప్రస్తావించమన్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో పోలవరం విషయం తీవ్ర వివాదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా సభా వేదికగా చంద్రబాబు స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మరో కీలక విషయం.. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించిన అంశంలో సర్దుకుపోయే ధోరణితో ఏపీ వ్యవహరిస్తోందన్న సందేశాన్ని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పనున్నారు. ఇప్పటికే ఆయన ఇరు రాష్ట్రాలు కలిసి ఉంటే మేలు జరుగుతుందని, గోదావరి నుంచి పోయే వృధా జలాలను వాడుకుని ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుందనేది చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట.
అవసరమైతే తాము కూడా సహకరిస్తామని కూడా చెబుతున్నారు. ఈ నేపద్యంలో తెలంగాణ నుంచి వస్తున్న విమర్శలు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న న్యాయపోరాటం వంటి అంశాలు కూడా అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా మారనున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఆయన చేపట్టిన తీర ప్రాంత హరితవనం కార్యక్రమం వ్యవహారం అసెంబ్లీలో ఆసక్తిగా మారే అవకాశం ఉంది .తీర ప్రాంతాలను 50% వరకు పచ్చగా మార్చే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. సో మొత్తంగా చూస్తే అసెంబ్లీ సమావేశాలు ఈసారి అభివృద్ధి -పెట్టుబడులు -జల విషయాలు వంటి అంశాల చుట్టు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
