Begin typing your search above and press return to search.

డుమ్మాకొట్టిన ఐఏఎస్ అధికారులు... సీఎం చంద్రబాబుకు షాక్!

రాజధాని అమరావతిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

By:  Tupaki Political Desk   |   11 Sept 2026 4:59 PM IST
డుమ్మాకొట్టిన ఐఏఎస్ అధికారులు... సీఎం చంద్రబాబుకు షాక్!
X

రాజధాని అమరావతిలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి 28 జిల్లాల కలెక్టర్లతోపాటు సెక్రటరీలు, HODలు హాజరు కావాల్సివుంది. అయితే కొందరు ఐఏఎస్ అధికారులు ముందస్తు సమాచారం లేకుండా సమావేశానికి గైర్హాజరు కావడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గమనించారు. తన ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంటే ఐఏఎస్ అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు. ఏం తమాషానా? అంటూ గైర్హాజరు అయిన అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని సీఎస్ సాయిప్రసాద్ ను ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సుకు కొందరు సీనియర్ అధికారులు గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయింది. శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో కొందరు అధికారులు లేకపోవడాన్ని సీఎం గమనించారు. ఒకరిద్దరు ఇతర పనులతో రాలేకపోయినట్లు సీఎస్ వివరించారు. అదేసమయంలో సమాచారం ఇవ్వకుండా ఉండిపోయిన అధికారుల విషయంలో మౌనం వహించారు. దీంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన సమావేశానికి బాధ్యత గల అధికారులు రాకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. వాట్సాప్ మెసేజులపై చూపిస్తున్న శ్రద్ధ ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో చూపడం లేదని సీఎం మండిపడ్డారు.

కలెక్టర్ల సమావేశానికి ఫోన్లు లేకుండా రావాలని తాను ముందే చెప్పానని సీఎం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ చాలా మంది అధికారులు ఫోన్లు తీసుకుని రావడం, సమావేశ మందిరం బయట తమ సిబ్బందికి అప్పగించి మాటమాటకి వాట్సాప్ మెసేజులను చూసుకోవడానికి బయటకు వెళుతుండటం సీఎం ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తాను ఎంతో ఓపికగా సమావేశం కొనసాగిస్తుంటే, కలెక్టర్లు కనీసం 12 గంటలు కదలకుండా కూర్చోలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాగా, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సీఎంతోపాటు మంత్రులు, ఆయా శాఖల విభాగాధిపతులు, కలెక్టర్లు హాజరు అవుతారు. అయితే గతంలో లేనట్లు ఈ సారి సమావేశాలకు ఫోన్లు తేవొద్దని సీఎం ముందే ఆదేశించారు. అయినప్పటికీ అధికారిక విధులలో బిజీగా ఉండే అధికారులు తమతో ఫోన్లు తీసుకురావడం తప్పనిసరిగా మారిందని అంటున్నారు.

అర్జంటు సమాచారం, ఇతర అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు అన్నీ ఫోన్లలో జరుగుతున్న సమయంలో ఫోన్ లేకుండా ఎలా? అని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోన్లు వెంట ఉండటం వల్ల అధికారులు తాను చెప్పే అంశాలపై శ్రద్ధ వహించలేకపోతున్నారని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. ఇక సమావేశానికి ఫోన్లు తీసుకురావడం, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఎక్కువ సమయం తీసుకోవడంపై సీఎం అసంతృప్తికి లోనరయ్యారని అంటున్నారు. దీంతో సమావేశంలోనే అందరినీ హెచ్చరిస్తూ డుమ్మా కొట్టిన వారి పేర్లు చదివి హెచ్చరికలు పంపారని అంటున్నారు. ఇక మంత్రులు కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని మందలించారు.