బాబుకు అమరావతికీ రాచ బాటేనా ?
అమరావతి రాజధాని మీద తన వ్యతిరేకతను పదే పదే జగన్ చాటుకుంటున్నారు అన్నది జనాలలో బలంగా ఏర్పడుతున్న భావనగా ఉంది. ఎందుకంటే లాజిక్ కి అందని విధంగా ఆయన వాదనలు కానీ నినాదాలు కానీ ఉన్నాయని అంటున్నారు.
By: Satya P | 4 July 2026 9:12 AM ISTఅమరావతి రాజధాని మీద తన వ్యతిరేకతను పదే పదే జగన్ చాటుకుంటున్నారు అన్నది జనాలలో బలంగా ఏర్పడుతున్న భావనగా ఉంది. ఎందుకంటే లాజిక్ కి అందని విధంగా ఆయన వాదనలు కానీ నినాదాలు కానీ ఉన్నాయని అంటున్నారు. అదే ఇపుడు టీడీపీకి చంద్రబాబుకు అలాగే అమరావతికీ రాచబాటగా మారుతున్నాయని అంటున్నారు. 2014లో అమరావతికి జగన్ జై కొట్టిన సంగతి అసెంబ్లీ రికార్డుల సాక్షిగా ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన తరువాతనే మూడు రాజధానులు అని జగన్ కొత్త టర్న్ తీసుకున్నారు. ఆనాడు ఆయన చెప్పినది మూడు ప్రాంతాలూ వికేంద్రీకరణ అన్నది, ఇక తాజాగా మావిగన్ అంటున్నారు. మరి ఇలా జగన్ ఆలోచనలు కీలకమైన ఏపీకి సెంటిమెంట్ గా ఉన్న రాజధాని విషయంలో మారిపోవడం వైసీపీకి జగన్ కి మైనస్ అవుతోందని అంటున్నారు.
నెత్తిన పాలు పోస్తున్నారా :
అదే సమయంలో టీడీపీ నెత్తిన జగన్ పాలు పోస్తున్నారు అని అంటున్నారు. ఇదంతా జగన్ వ్యూహాల లేమితో చేస్తున్నారా లేదా వేరే ఆలోచనలతోనా అంటే వీటన్నిటి కంటే కూడా అమరావతి రాజధాని పట్ల జగన్ కి వ్యతిరేకత మొదటి నుంచి ఉంది అన్న దానిని టీడీపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇపుడు జగన్ కూడా అదే నిజం అని రుజువు చేసుకుంటున్నారు అని ఎత్తి చూపిస్తున్నారు. లేకపోతే విశాఖ రాజధాని అన్నపుడు రెడీ మేడ్ సిటీ అన్నారు, మరి ఆనాడు జగన్ కి మావిగన్ ఎందుకు గుర్తు రాలేదు అని ప్రత్యర్ధులు అంటున్నారు. ఇది పాయింటే కదా అని జనాలలోనూ ఆలోచన ఉంది. మరి మావిగన్ అంటున్నాపుడు వికేంద్రీకరణ అంశం ఏమైపోయింది అన్నది మరో ప్రశ్న. ఉత్తరాంధ్రా రాయలసీమ వెనుకబాటుతనానికి గురి అయ్యాయని చెప్పి రాజధానులు అక్కడ పెడతామని చెప్పి ఇపుడు యూటర్న్ తీసుకుంటే ఆ ప్రాంతాల వారికి వైసీపీ ఏ విధంగా జవాబు చెబుతుందని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల అజెండా సెట్ చేసి :
టీడీపీకి పెద్దగా శ్రమ ఆయాసం లేకుండా మూడేళ్ళకు ముందే రాజధాని అజెండాను జగన్ సెట్ చేసి పెట్టారు అని అంటున్నారు. నిజానికి 2029 ఎన్నికల్లో నినాదాలు అయితే ఎవరికీ లేవు. టీడీపీ కూడా 2014, 2024లలో అమరావతి నినాదాన్ని ఎమోషనల్ గా ఉపయోగించింది. అదే భావోద్వేగపూరిత మైన నినాదంగా చేసుకుని జనంలోకి వెల్ళింది.జనాలు కూడా జై కొట్టారు. 2029 నాటికి ఆ నినాదం ఉండదని అంతా అనుకున్నారు. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది. దాంతో పాటు ప్రజలు కూడా అమరావతి రూపూ షేపూ చూస్తారు, ఎంతో కొంత వారికి చూపించాల్సిన ఒత్తిడి అయితే కూటమి మీద ఉంది. అది ఎంత అన్నది జనాల సంతృప్తి బట్టి ఆధారపడి ఉంటుంది. అమరావతి పూర్తి స్థాయిలో పూర్తి అవడం అంటే మూడేళ్ళలో సాధ్యం కాదు, ఈ నేపథ్యంలో కొంత టీడీపీకి ఇబ్బందే అవుతుంది. కానీ జగన్ మధ్యలో వచ్చి మావిగన్ నినాదం ఎత్తుకోవడంతో అమరావతి సెంటిమెంట్ కి మళ్లీ ఊపిరులు అద్దినట్లు అయింది అని విశ్లేషిస్తున్నారు.
ఎంత పూర్తి అయినా సరే :
జగన్ అంతటితో ఆగకుండా అమరావతినా మావిగన్ నా అని ఒక పోలిక పోటీ తెస్తూ 2029లో ఇదే అజెండా అన్నారు. సహజంగానే అమరావతి అన్నది ఇపుడు కళ్ళకు కనిపిస్తున్నది, చట్టబద్ధత కేంద్రం ఇచ్చింది. యాభై వేల కోట్ల రూపాయలతో భారీ ఎత్తున నిర్మాణం పనులు అవుతున్నాయి. దాంతో ఎవరూ అమరావతిని ఈ దశలో వద్దు అనుకోరు, ఇపుడు రాజధాని ఎంపిక అన్నది అయిపోయిన చరిత్ర. దాంతో మావిగన్ అన్నా మరోటి అన్నా జనాల మొగ్గు అమరావతికే ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో జగన్ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో మూడు రాజధానులు అని చెప్పారు, అది విఫల ప్రయోగం అయింది. ఇపుడు మావిగన్ అన్నా అలాగే అవుతుంది అన్న సంశయాలు కూడా ఉంటాయి. దాంతో పాటు ఏపీ జనాలు రాజధాని విషయంలో ప్రయోగాలకు విసిగి ఉన్నారని అంటున్నారు. ఇలా ఎన్ని రకాలుగా చూసుకున్నా అమరావతికే జనాలు ఓటెత్తే విధంగా అనివార్యమైన పరిస్థితి ఉంది. దాంతో అమరావతి నినాదాన్ని మరో ఎన్నికల దాకా టీడీపీ కూటమి వినియోగించుకునేలా జగన్ రాచబాట వేశారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
