అమరావతి...బాబు మాస్టర్ హిట్ అయితే కనుక !
ముఖ్యమంత్రి చంద్రబాబు ది దాదాపుగా అయిదు దశాబ్దాలుగా తలపండిన రాజకీయ అనుభవం.
By: Satya P | 23 July 2026 9:21 AM ISTముఖ్యమంత్రి చంద్రబాబు ది దాదాపుగా అయిదు దశాబ్దాలుగా తలపండిన రాజకీయ అనుభవం. అంతే కాదు ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు క్రియేట్ చేస్తున్నారు. అలా అటు రాజకీయాల్లో ఇటు పాలనలో బాబుని మించిన వారు తెలుగు రాష్ట్రాలలో ఎవరూ లేరు అని చెప్పాలి. బాబు తాను ఎపుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. ప్రతీ సంక్షోభం తనకు సవాల్ అని దాని నుంచే పరిష్కారాలను వెతికే సోపానాలుగా మార్చుకుంటాను అని. అలా బాబు ఏపీ విభజనను కూడా ఒక సవాల్ గా తీసుకున్నారు. రాజధాని లేని ఏపీకి అమరావతి వంటి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించేందుకు ఆయన పూనుకున్నారు.
నాటి తప్పులను చేయకుండా :
ఇక 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో ఎక్కువగా ఫోకస్ పెట్టలేకపోయారు. ప్రధానంగా డిజైన్ల విషయంలో అధికంగా సమయం వెచ్చించారు. ఇక రాజకీయంగా చూస్తే వైసీపీని తక్కువగా అంచనా వేశారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి గట్టి దెబ్బ పడింది. దాంతో బాబు ఎక్కడ లోపాలు జరిగాయో బాగానే తెలుసుకున్నారు. ఆ అవగాహనతోనే ఆయన 2024 ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజకీయంగా పాలనా పరంగా పట్టు బిగించేసారు. వైసీపీని పూర్తిగా కట్టడి చేస్తూనే పాలనాపరంగా దూకుడు పెంచారు. అమరావతి నిర్మాణం విషయంలో పాలన తొలి రోజు నుంచే బాబు శ్రీకారం చుట్టారు. ఇప్పటికి రెండేళ్ళు గడిచాయి. అమరావతి రాజధాని నిర్మాణాలు ఊపందుకున్నాయని అంటున్నారు.
కలసి వస్తున్న పరిణామాలు :
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, మెజారిటీ లేకపోవడంతో ఏపీలో టీడీపీకి కలసి వచ్చింది. దాంతో బాబు రుణాలు అయినా మరో విధంగా అయినా అమరావతికి కేంద్ర సాయంతో దండీగానే నిధులను తీసుకుని రాగలుగుతున్నారు. తొలి దశలో అమరావతి నిర్మాణాలకు ఏకంగా అరవై వేల కోట్లను సేకరించగలిగారు అంటే బాబు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఎక్కడా ఏ విధంగా జాప్యం లేకుండా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించేందుకు బాబు అధిక శ్రమను పడుతున్నారు. ఆయన వారంలో కనీసంగా రెండు రోజుల పాటు అమరావతి మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఇక మంత్రి నారాయణను ఆ పని మీదనే పూర్తిగా కేటాయించేశారు. ఏ విధంగా చూసుకున్న అనుకున్న సమయానికి అమరావతి మొదటి దశ పూర్తి కావాలని బాబు గట్టి పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు.
ఎల్ నినోతో అక్కడ ప్లస్ :
నిజానికి ఎల్ నినోతో దేశంలో చాలా చోట్ల వానలు లేవు, ఏపీలో కూడా అదే పరిస్థితి. కానీ ఎల్ నినో ప్రభావం అమరావతికి ప్లస్ అవుతోంది. వానలు ఈ సీజన్ లో ఎక్కువగా కురిస్తే అమరావతి నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడి తీవ్ర జాప్యం జరిగేది. కానీ వానలు లేకపోవడం వల్ల నాన్ స్టాప్ గా అమరావతి రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోజుకు మూడు నుంచి నాలుగు వేల మంది కూలీలు అక్కడ పనిచేస్తున్నారు అంటే ఏ స్థాయిలో పని సాగుతోంది అన్నది అర్ధం చేసుకోవాల్సిందే అని అంటున్నారు. ఇక అమరావతి పనులను బాబు క్లోజ్ మోనిటరింగ్ చేయడంతో పాటు గుత్తేదారులకు కూడా సూచనలు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాంలో రాళ్ళెత్తిన కూలీలకు కూడా పేరు వస్తుంది కాబట్టి అంతా కలసి రాష్ట్ర పునర్ నిర్మాణంలో పాలు పంచుకోవాలని ఆయన ఎమోషనల్ టచ్ తో ఇస్తున్న పిలుపు కూడా బాగా పనిచేస్తోంది అని అంటున్నారు.
డెడ్ లైన్ లోగానే :
ఇక అమరావతి తొలిదశ నిర్మాణం పనులు 2028 నాటికి పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే విధంగా డెడ్ లైన్ విధించి మరీ అందరికీ దిశా నిర్దేశం చేస్తున్నారు. పోలవరం ఎటూ 2027 నాటికి పూర్తి అవుతుంది. అమరావతి 2028లో పూర్తి అయితే ఈ రెండూ చూపించి 2029 ఎన్నికలకు వెళ్తే టీడీపీ కూటమి తిరిగి గెలిచేందుకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉంటాయని ఆయన భావిస్తున్నారు.
సంపద కూడా అక్కడే :
తొలి దశ నిర్మాణం పనులు అమరావతిలో పూర్తి కావాలి కానీ సంపద అక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని బాబు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం కాకుండా మిగిలిన భూములను వేలం వేస్తే కనుక హైదరాబాద్ కోకాపేట స్థాయిలో అక్కడ భూములకూ బంగారం మాదిరిగా డిమాండ్ వస్తుందని ఆ విధంగా లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుందని లెక్క వేస్తున్నారు. ఒక్క సారి కనుక అమరావతి గ్రోత్ ఇంజన్ గా మారి ఏపీని ఆదుకుంటే ఇక తిరుగు ఉండదన్నదే బాబు మార్క్ ప్లాన్. మొత్తానికి అమరావతి రాజధాని నిర్మాణంతో బాబు చరిత్రలో తన పేరుని సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలని పడుతున్న తపన మాత్రం గ్రేట్ అనే చెప్పాల్సి ఉంటుంది.
