అజిత్.. నన్ను 'అన్న' అని పిలిచేవారు: చంద్రబాబు
విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఏపీ మంత్రివర్గం నివాళులర్పించింది.
By: Garuda Media | 28 Jan 2026 7:18 PM ISTవిమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఏపీ మంత్రివర్గం నివాళులర్పించింది. సీఎం చంద్రబాబు సారథ్యంలో.. బుధవారం మంత్రి వర్గం భేటీ అయింది. అమరా వతిలోని సచివాలయంలో ప్రారంభమైన ఈ సమావేశంలో తొలుత విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందడం పట్ల మంత్రి వర్గ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం.. సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్ తో సహా ఐదుగురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ తో తనకు ఉన్న పరిచయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణం చెందారన్న విషయం తెలిసి.. తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తనకు.. ఆయనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆల్ మట్టి డ్యామ్ ఎత్తుపై పోరాటం చేసినప్పుడు.. అక్కడ ఆయన విపక్షంలో ఉన్నారని.. తనకు సహకరించారని చెప్పారు. తనను ఎప్పుడు కలిసినా.. అన్నా అని సంబోధించేవారని తెలిపారు. గతంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో పలుమార్లు అజిత్‌తో సంభాషించిన సందర్భాలు ఉన్నాయన్నారు. అనంతరం.. అజిత్ పవార్ మృతికి సంతాపం తెలుపుతూ ఏపీ క్యాబినెట్ లో తీర్మానం చేశారు.
