ఏపీలో 2028 కూటమికి భారీ ప్లస్.. ఎలాగంటే!
దీంతో కూటమి మరోసారి అత్యంత సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
By: Garuda Media | 29 Aug 2026 11:00 AM ISTవచ్చే 2029లో ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. దీనికి ముందు అంటే.. 2028లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులుగా భావిస్తున్న పలు ప్రాజెక్టులను ప్రజలకు చేరువ చేయనున్నారు. దీంతో ఏపీలో 2028 సంవత్సరం కూటమి ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు విజన్‌కు భారీ ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. ఈ రిఫ్లెక్షన్ ఎన్నికలపైనా పడుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో కూటమి మరోసారి అత్యంత సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు.
ఏంటా ప్రాజెక్టులు?
1) రాజధాని అమరావతి తొలిదశ: ఏపీ రాజధాని అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిధులకు కొరత లేకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. అంతేకాదు.. సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నా రు. దీంతో రాజధాని అమరావతి తొలి దశ పనులు 2028 అక్టోబరు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అదేసమ యంలో రైతులకు ఇవ్వాల్సిన డెవలప్డ్ ప్లాట్లను కూడా అభివృద్ధి చేసి ఇవ్వనున్నారు.
2) విశాఖలో గూగుల్ డేటా సెంటర్: విశాఖలో గూగుల్ డేటా కేంద్రానికి కొన్ని నెలల కిందట శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ కేంద్రం నిర్మాణం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. అయితే.. దీనికికూడా ప్రభుత్వం టైమ్‌బౌండ్ పెట్టింది. ఎట్టి పరిస్థితిలోనూ 2028 నాటికి ఈ కేంద్రాన్ని పూర్తిచేయాలని నిర్దేశించింది. దీనికి గూగుల్ కూడా అంగీకరించింది. అదానీ సహా గూగుల్ సారథ్యంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రం.. ద్వారా సుమారు లక్ష మందికి ఉపాధి కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
3) శాశ్వత సెక్రటేరియట్, అసెంబ్లీ: ఇక, రాజధానిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శాశ్వత హైకోర్టు కూడా 2028 నాటికి పూర్తి కానుందని.. తాజాగా ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ప్రస్తుతం ఈనిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల న్యాయమూర్తులు కూడా ఇక్కడ పర్యటించి.. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలానే.. వచ్చే నెలలో శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. దీనికి నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్లాన్ ఇస్తోంది.
అదేసమయంలో పెరగనున్న అసెంబ్లీ, శాసన మండలి స్థానాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇది కూడా 2028 నాటికి పూర్తవుతుందని స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఇలా ఎన్నికలకు ముందు కూటమి సర్కారు వైసీపీకి భారీ షాక్ ఇవ్వడంతోపాటు.. ప్రజలకు చేరువ అయ్యేలా పక్కా ప్రణాళిక, అభివృద్దితో కూడిన అజెండాతో ముందుకు సాగనుంది.
