Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో క్వాంటం విప్లవం.. బాబు అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి?

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో విప్లవం సృష్టించిన తెలుగు నేల, ఇప్పుడు ప్రపంచాన్ని శాసించబోతున్న ‘రెండో ఐటీ విప్లవం’ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.

By:  Tupaki Political Desk   |   11 Jan 2026 11:40 AM IST
తెలుగు రాష్ట్రాల్లో క్వాంటం విప్లవం.. బాబు అడుగుజాడల్లో రేవంత్ రెడ్డి?
X

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో విప్లవం సృష్టించిన తెలుగు నేల, ఇప్పుడు ప్రపంచాన్ని శాసించబోతున్న ‘రెండో ఐటీ విప్లవం’ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వేగంలో వెలుగుతో పోటీపడే క్వాంటం కంప్యూటింగ్, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఈ రెండు అస్త్రాలను చేతబూని జంట తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భవిష్యత్తుపై గురిపెట్టారు. చంద్రబాబు నాయుడు ‘క్వాంటం వ్యాలీ’తో పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంటే, రేవంత్ రెడ్డి అదే సాంకేతికతను ప్రాణాలను కాపాడే వైద్య విజ్ఞానంతో ముడిపెడుతున్నారు. రాజకీయ వైరుఢ్యాలు ఎలా ఉన్నా, ఆధునిక సాంకేతికత విషయంలో ఈ ఇద్దరు నేతల ఆలోచనలు కలవడం తెలుగు రాష్ట్రాల ప్రగతికి సరికొత్త దిక్సూచిగా మారుతోంది.

భారతదేశ సాంకేతిక పటంలో తెలుగు రాష్ట్రాలది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) కి పునాదులు వేసిన దార్శనికత, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా భవిష్యత్ సాంకేతికతగా పిలవబడే క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు (AI) విషయంలో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చూపుతున్న ఆసక్తి రెండు రాష్ట్రాల అభివృద్ధికి శుభసూచకంగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్: క్వాంటం వ్యాలీ దిశగా అడుగులు

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు శైలే వేరు. డేటా ప్రాసెసింగ్ వేగాన్ని ఊహించని రీతిలో పెంచే ‘క్వాంటం కంప్యూటింగ్’ భవిష్యత్తును మార్చబోతుందని ఆయన ముందుగానే గుర్తించారు. ఇందులో భాగంగానే, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), L&T వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో భారతదేశపు మొట్టమొదటి ‘క్వాంటం వ్యాలీ టెక్ పార్క్’ ఏర్పాటు కాబోతోంది. ఇది కేవలం ఒక కార్యాలయం కాదు.. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, లోతైన పరిశోధనల సమాహారం. ఈ వ్యాలీ ద్వారా అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలకు ఏపీ కేంద్ర బిందువు కానుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం వినియోగించుకోవడమే కాకుండా, దానిని సృష్టించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలన్నది నాయుడు దృక్పథం.

తెలంగాణ: సాంకేతికతతో కూడిన మానవీయ వైద్యం

మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం సాంకేతికత ప్రాముఖ్యతను గుర్తించడంలో వెనకడుగు వేయడం లేదు. ఇటీవల జరిగిన హెల్త్‌కేర్ కాన్క్లేవ్‌లో ఆయన చేసిన ప్రసంగం దీనికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు టెక్నాలజీని పారిశ్రామిక వృద్ధికి సాధనంగా చూస్తే, రేవంత్ రెడ్డి దానిని సామాజిక ఆరోగ్య పరిరక్షణకు అనుసంధానం చేస్తున్నారు. క్వాంటం కంప్యూటింగ్, AI ప్రభావం ఆరోగ్య సంరక్షణ రంగంపై విపరీతంగా ఉండబోతోందని రేవంత్ స్పష్టం చేశారు. వైద్యులు కేవలం పాత పద్ధతులకే పరిమితం కాకుండా, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, యంత్రాల యుగంలో ‘మానవీయ స్పర్శ’ (Human Touch) కోల్పోకూడదని ఆయన చేసిన సూచన ఆలోచించదగ్గది. టెక్నాలజీ ఎంత పెరిగినా రోగికి వైద్యునిపై ఉండే నమ్మకమే ప్రధానమని ఆయన నొక్కి చెప్పారు.

ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పులు

గుండె జబ్బుల మరణాలపై రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళన సమంజసమే. సాంకేతికత సాయంతో వ్యాధులను ముందే గుర్తించడం ఒక ఎత్తయితే, ప్రాథమిక వైద్య సాయం అందించడం మరొక ఎత్తు. పాఠశాల విద్యార్థులకు CPR (Cardiopulmonary Resuscitation) శిక్షణ ఇవ్వాలని, అందులో వైద్యులు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన కోరడం ఒక గొప్ప సామాజిక బాధ్యత. సాంకేతికతను నైపుణ్యంతోనూ, ప్రాణాలను కాపాడే సంకల్పంతోనూ ముడిపెట్టడం రేవంత్ రెడ్డి దార్శనికతకు అద్దం పడుతోంది.

సాంకేతిక పరిజ్ఞానం విషయంలో రేవంత్ రెడ్డి తన పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు నుంచి ప్రేరణ పొందడం లేదంటే ఆయన అడుగుజాడల్లో నడవడం అనేది రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అంశం. అభివృద్ధి విషయంలో ఒకరినొకరు పోటీ పడటం.., ఒకరిలోని మంచిని మరొకరు స్వీకరించడం వల్ల అంతిమంగా తెలుగు ప్రజలకే మేలు జరుగుతుంది. క్వాంటం కంప్యూటింగ్ అనేది కేవలం గణిత శాస్త్రం కాదు; అది రేపటి ప్రపంచపు ఆర్థిక, సామాజిక ఇంజిన్. ఆంధ్రప్రదేశ్ తన 'క్వాంటం వ్యాలీ' ద్వారా హార్డ్‌వేర్ రంగంలో, తెలంగాణ తన 'టెక్-హెల్త్' విజన్ ద్వారా సేవా రంగంలో దూసుకుపోతే, భారతదేశంలోనే తెలుగు రాష్ట్రాలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయం. భవిష్యత్తు క్వాంటం మయం, ఆ భవిష్యత్తుకు తెలుగు నేల వేదిక కాబోతోంది.