Begin typing your search above and press return to search.

మొరాకో-స్పెయిన్ సరిహద్దు సంక్షోభం : రెక్కలొచ్చిన ఆశలు.. నీటమునిగిన బతుకులు.. తీరంలో మానవీయ విషాదం

ఉత్తర ఆఫ్రికా తీరంలో ఉన్న స్పెయిన్‌కు చెందిన సెయుటా సరిహద్దులు ఈరోజు కన్నీటి సముద్రాన్ని తలపిస్తున్నాయి.

By:  A.N.Kumar   |   1 Aug 2026 11:31 AM IST
మొరాకో-స్పెయిన్ సరిహద్దు సంక్షోభం : రెక్కలొచ్చిన ఆశలు.. నీటమునిగిన బతుకులు.. తీరంలో మానవీయ విషాదం
X

బాగా జీవించాలి.. ఆకలి లేని లోకంలో తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలి.. ఇదీ ఆ వేలాది మంది వలసదారుల గుండెల్లో మెదిలిన ఏకైక కోరిక. కానీ ఆ ఆశే వారి పాలిట మృత్యుపాశమైంది. ఉత్తర ఆఫ్రికా తీరంలో ఉన్న స్పెయిన్‌కు చెందిన సెయుటా సరిహద్దులు ఈరోజు కన్నీటి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఐరోపా నేలపై అడుగుపెడితే తమ బతుకులు మారతాయన్న నమ్మకంతో వచ్చిన దాదాపు 60 వేల మంది అమాయక జీవులు, ఇప్పుడు భయాందోళనల మధ్య సరిహద్దుల్లో చిక్కుకుపోయారు.

ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆశయాలు.. ఎగసిపడిన కెరటాలు

కళ్లల్లో కొత్త జీవితం గురించిన కోటి ఆశలు, గుండెల్లో రేపటిపై భయం.. టరాజల్ బీచ్ వద్ద సరిహద్దు కంచెలను దాటేందుకు ఊపిరి బిగబట్టి సముద్రంలోకి దూకిన దృశ్యాలు ఎవరినైనా కలచివేస్తాయి. పసిపిల్లలను గుండెలకు హత్తుకుని, ఎగసిపడే అలలతో పోరాడుతూ ఈదిన ఆ తల్లుల ఆర్తనాదాలు అక్కడి వాతావరణాన్ని శోకసంద్రంగా మార్చేశాయి. చొరబాటును నిరోధించే క్రమంలో జరిగిన తొక్కిసలాటలు, ఉద్ధృతమైన కెరటాల ధాటికి ఇప్పటివరకు 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. మెరుగైన భవిష్యత్తు వైపు సాగిన వారి అడుగులు శవాలై తీరానికి కొట్టుకురావడం మానవత్వానికే ఒక మచ్చగా మిగిలిపోతోంది. "మానవ అక్రమ రవాణా ముఠాలు అమాయక యువత, కుటుంబాల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి’’ అని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆశ్రయం లేక వీధుల్లోనే సరిహద్దు శరణార్థులు

ఒకేసారి వేలాది మంది సరిహద్దులు దాటడంతో సెయుటాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు క్రిక్కిరిసిపోవడంతో చలిలో పసిపిల్లలతో సహా వందలాది కుటుంబాలు వీధుల్లోనే కాలం వెళ్లదీస్తున్నాయి. భద్రత కోసం స్పెయిన్ ప్రభుత్వం సరిహద్దుల్లో సైన్యాన్ని, డ్రోన్లను, యుద్ధ నౌకలను మోహరించింది. మరోవైపు అప్పటికే సరిహద్దు దాటిన 48,300 మందికి పైగా వలసదారులను బలవంతంగా తిరిగి మొరాకోకు పంపించివేస్తున్నారు. సరిహద్దు ఇరువైపులా చెలరేగుతున్న ఈ ఉద్రిక్తతలు మానవ హక్కుల ప్రశ్నార్థక స్థితిని కళ్లకు కడుతున్నాయి.

మిగిలిన ప్రశ్నలు.. చెదిరిన స్వప్నాలు

ఇది కేవలం రెండు దేశాల సరిహద్దు సంక్షోభం మాత్రమే కాదు, ఆకలి, పేదరికం, మెరుగైన జీవితం కోసం అలమటిస్తున్న వేలాది జీవుల ఆక్రందన. 1580 నుండి స్పెయిన్ ఆధీనంలో ఉన్న ఉత్తర ఆఫ్రికాలోని చిన్న ప్రాంతం సెయుటా.. ఆఫ్రికా వాసులకు ఐరోపా కలల ద్వారంగా మారింది. 2021లో కూడా ఇలాంటి ఘటనే పునరావృతమైనప్పటికీ నేటి పరిణామాలు మరింత దారుణమైన మానవీయ సంక్షోభాన్ని ముంగిట్లోకి తెచ్చాయి. ఏ రాజకీయాలు, ఏ చట్టాలు ఎలా ఉన్నప్పటికీ.. కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఈ అనాథల క్రందనలు ప్రపంచ దేశాల మనస్సాక్షిని నిలదీస్తూనే ఉన్నాయి.