పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి?: కేంద్రం ఆన్సర్ ఇదే
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి.. దాదాపు 40 రోజులు దాటిపోయింది. లీటరు పెట్రోల్‌పై 10 నుంచి 12 రూపాయల వరకు, డీజిల్‌పై 11-15 రూపాయల వరకు పెరిగిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 3 July 2026 12:00 AM ISTదేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి.. దాదాపు 40 రోజులు దాటిపోయింది. లీటరు పెట్రోల్‌పై 10 నుంచి 12 రూపాయల వరకు, డీజిల్‌పై 11-15 రూపాయల వరకు పెరిగిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అవాంతరాలను కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అదేసమయంలో డాలరుతో రూపాయి మారకం విలువ కూడా పడిపోవడంతో ధరలు పెరిగాయని పేర్కొంది.
అప్పటికే పెట్రోలియం కంపేనీలకు ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేశామని అయినా నష్టాలు వస్తూనే ఉన్నాయని కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పెరిగిన ధరలను సమర్థించుకుంది. కాగా.. ఇప్పుడు యుద్ధం ఆగిపోయి.. దాదాపు ధరలు కూడా దిగివచ్చాయి. బ్యారెల్ ముడి చమురు70 డాలర్లకు దిగువకు పడిపోయింది. బేరం ఆడితే.. 65-68 డాలర్ల మధ్య కూడా లభిస్తోంది. ఫలితంగా భారీగానే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టి వారం అయింది.
దీంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అనే ప్రశ్న ఉదయించింది. దీనిపై పలు పత్రికల్లోనూ ప్రజల నాడిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. 10 రూపాయలు, 15 రూపాయలే కదా పెరిగింది? ఆమాత్రం భరించలేరా? అనే ప్రశ్న కొందరు అడుగుతున్నారు. కానీ, వ్యక్తిగతంగా అయితే .. భరించవచ్చేమోకానీ.. ఈ పెరిగిన డీజిల్ ధరలతో సరుకురవాణా సహా గ్యాస్ రవాణా పెరిగిపోయి.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో సామాన్యుడు కొనే వస్తువుల ధరలు దాదాపు మూడోవంతు పెరిగింది.
ఈ నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు కోసం వేచి చూస్తున్నారు. కాగా.. దీనిపై కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చాలా చిత్రమైన సమాధానం ఇచ్చారు. ``యుద్ధం ఆగిపోయినా.. మనం అప్పట్లో భారీ ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురునే ప్రాసెస్ చేస్తున్నాం. సో.. ఈ చమురు అయిపోయే వరకు ధరలు కొనసాగుతాయి.`` అని చెప్పారు.
అంతేకాదు.. ``సదరు ఖరీదైన చమురు అయిపోయినా.. 4 నుంచి 5 నెలల పాటు పశ్చిమాసియాలో పరిస్థితి ప్రశాంతంగా నే ఉంటుందని ఎవరు చెప్పగలరు?`` అని ప్రశ్నించారు. ``అప్పటికీ ప్రశాంతంగా ఉంటే.. అప్పుడు ధరల తగ్గింపు అనే ప్రశ్నకు సమాధానం వెతకవచ్చు!..`` అని వ్యాఖ్యానించారు. అంటే.. ఇప్పట్లో ధరలు తగ్గుముఖంపట్టవని కేంద్రం స్పష్టం చేసిందన్న మాట.
