చంద్రబాబుపై రేవంత్ పైచేయి.. బనకచర్లపై రేవంత్ వాదనకు కేంద్రం సపోర్టు?!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడంపై రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృత చర్చకు దారితీసింది.
By: Tupaki Political Desk | 7 Aug 2026 4:19 PM ISTఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడంపై రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ పరిణామాన్ని 'గురువుపై శిష్యుడి గెలుపు'గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. అంతర్ రాష్ట్ర సమస్యలు ఉండటంతో సెంట్రల్ వాటర్ కమిషన్ విశ్లేషణ అవసరమని భావించిన కేంద్రం ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను వెనక్కి పంపినట్లు చెబుతున్నారు. గత ఏడాది జూన్ 17న ఎక్సపర్ట్ అప్రైజల్ కమిటీకి ఏపీ ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్టు (పీఎఫ్ఆర్), టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను అప్పట్లోనే కేంద్రం వెనక్కి పంపిందని చెబుతున్నారు. తాజాగా ఈ అంశంపై వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో సీడబ్ల్యూసీ, పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే మళ్లీ బనకరచర్ల ప్రాజెక్టుపై ప్రతిపాదనలు పంపాల్సివుంటుందని అంటున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు గోదావరి-పెన్నా నదుల అనుసంధానానికి ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ స్వరూపాన్ని మార్చేసే శక్తి ఈ ప్రాజెక్టుకు ఉందని సీఎం చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తమ సాగునీటి హక్కులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది. దీంతో బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం మరిన్ని అనుమతులు సాధించాల్సివుందని ఏపీ ప్రతిపాదనలను పక్కన పెట్టిందని అంటున్నారు.
ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర సమస్యలు ఉండటం ప్రధాన అడ్డంకిగా మారింది. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీకి ఫిర్యాదులు అందాయి. దీనివల్ల సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సమగ్ర విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని, పర్యావరణ ప్రభావంపై అధ్యయనానికి సీడబ్ల్యూసీ ఎన్‌వోసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. గతంలోనే కేంద్రం ఈ ప్రతిపాదనను తిప్పి పంపినప్పటికీ, తాజాగా రాజ్యసభలో దీనిపై వచ్చిన ప్రశ్నతో కేంద్రం అధికారికంగా వివరణ ఇచ్చింది.
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం గట్టి అభ్యంతరాలను వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఏ ప్రాజెక్టు చేపట్టకూడదని, అంతర్రాష్ట్ర జల వివాదాలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ వాదనను బలపరిచేలా కేంద్రం బనకచర్ల ప్రతిపాదనలను వెనక్కి పంపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని అంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైచేయి సాధించారనే చర్చ జరుగుతోంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, సాంకేతిక, చట్టపరమైన అభ్యంతరాలను తెరపైకి తేవడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైందని, తద్వారా చంద్రబాబుకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ ఉదంతాన్ని 'గురువుపై శిష్యుడి గెలుపు' అంటూ అభివర్ణిస్తున్నారని అంటున్నారు.
కాగా, బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు పలువురు నీటిపారుదల రంగ నిపుణులు ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని, పైగా ఆర్థికంగా పెను భారం అవుతోందని ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం లెక్కచేయకుండా ఈ విషయంలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిందని చెబుతున్నారు. గోదావరిలో వృథాగా సముద్రం పాలవుతున్న వరద జలాలను తరలించి బనకచర్ల ద్వారా పెన్నా నదికి నీటిని తరలిస్తామని, రాష్ట్రానికి శాశ్వతంగా సాగునీటి సమస్య లేకుండా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం కొర్రీ వేయడంతో మళ్లీ మొదటికి వచ్చినట్లైందని అంటున్నారు.
