Begin typing your search above and press return to search.

మొదటిసారి కేంద్రం కాళ్లబేరం.. కీలక బిల్లుల కోసం రాహుల్ తో చర్చలు

దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది.

By:  Tupaki Political Desk   |   6 Aug 2026 6:59 PM IST
మొదటిసారి కేంద్రం కాళ్లబేరం.. కీలక బిల్లుల కోసం రాహుల్ తో చర్చలు
X

దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగియనుండటంతో, ఆ లోపే రెండు కీలక బిల్లులను నెగ్గించుకునే దిశగా సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో సమావేశం కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కీలక బిల్లుల విషయంలో విపక్షం మద్దతు లేకుండా నెగ్గించుకునే పరిస్థితి లేకపోవడంతో కేంద్రం తొలిసారిగా ఓ మెట్టు దిగేందుకు సిద్ధమైందని ఈ ఘటన రుజువు చేసిందని అంటున్నారు.

కీలక బిల్లుల ఆమోదంపై చర్చించేందుకు కేంద్రమంత్రి స్వయంగా రాహుల్ చాంబర్ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్‌ గొగోయ్‌ సుమారు 50 నిమిషాలపాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజుతో భేటీ అయ్యారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి సహకరించాలని రాహుల్‌ను మంత్రి కోరారు. అయితే, కేంద్రం విజ్ఞప్తులను రాహుల్‌ గాంధీ సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ ఉదంతంపై ఉభయసభల్లో తక్షణమే చర్చ చేపట్టాలని, గత నెల 20న ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభలో అధికారికంగా ప్రకటన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లను అంగీకరించే వరకు ప్రభుత్వానికి ఎలాంటి సహకారమూ అందించేది లేదమని రాహుల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

గత పది రోజుల్లో రాహుల్‌తో రిజిజు భేటీ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ భేటీ అనంతరం కిరణ్‌ రిజిజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్‌ షాలను కలిసి రాహుల్ వైఖరిని వివరించారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌తో కూడా సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనలను తొలగించేందుకు కేంద్రం ఒక అడుగు ముందుకు వేయనుంది. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ సీట్ల సంఖ్యను కనీసం 50 శాతం పెంచేలా ప్రత్యేక క్లాజును ఈ బిల్లులో చేర్చనున్నట్లు సమాచారం.

సంఖ్యాబలం సవాల్‌.. డీఎంకే పాత్ర కీలకం

రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించుకోవాలంటే లోక్‌సభలో 360 మంది, రాజ్యసభలో 164 మంది ఎంపీల మద్దతు (2/3 మెజారిటీ) అత్యంత కీలకంగా చెబుతున్నారు. గతంలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు 298 మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీలికలు వచ్చి కొందరు ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గుచూపారు. అలాగే శివసేన (ఉద్ధవ్‌) పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఏక్‌నాథ్‌ షిండే వర్గంలో చేరడంతో ఎన్డీఏ బలం సుమారు 320కి చేరింది. అయినప్పటికీ 360 అనే మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇంకా దూరం ఉండటంతో కేంద్రం విపక్ష పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో తమిళనాడు రాజకీయ సమీకరణాల కారణంగా 'ఇండియా' కూటమి నుంచి డీఎంకే వైదొలిగింది. ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీల మద్దతును కూడగట్టుకోవడం ద్వారా సంఖ్యాబల కొరతను తీర్చుకోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే, కూటమికి దూరమైనంత మాత్రాన డీఎంకే పూర్తిగా ఎన్డీఏకు మద్దతిస్తుందా? లేదా? అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేక సమావేశాలు.. ఊహాగానాలే

ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులు ఆమోదం పొందకపోతే, ఈ నెల 16 నుంచి 18 మధ్య పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం యోచిస్తోందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిపై స్వయంగా కిరణ్‌ రిజిజు స్పష్టతనిచ్చారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుల కోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించే ఎలాంటి ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ప్రస్తుత సమావేశాలు మరో వారం రోజుల పాటు కొనసాగనున్నందున, ఈ లోపే బిల్లులను సభ ముందుకు తెచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.