పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత.. జులై 1 నుంచి వాహనదారులకు భారీ ఊరట
దేశవ్యాప్తంగా వాహనదారులకు, రవాణా రంగ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
By: A.N.Kumar | 29 Jun 2026 11:26 PM ISTదేశవ్యాప్తంగా వాహనదారులకు, రవాణా రంగ నిర్వాహకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత నెలలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. వచ్చే జులై 1 నుంచి దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఎలాంటి పరిమితులు లేకుండా.. సాధారణ విధానంలో ఇంధన విక్రయాలు పునఃప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం.. దేశీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంక్షలు విధించడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి?
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు సరఫరాపై తీవ్ర అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం జూన్ 12న కొన్ని తాత్కాలిక ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఒకే కస్టమర్ లేదా ఒకే వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించకూడదనే నిబంధన విధించారు. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ ఉంచి.. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా నిలిచింది.
ఇంధనం దారి మళ్లింపు.. బ్లాక్ మార్కెట్ కలకలం
సాధారణ రిటైల్ ధరలతో పోలిస్తే పారిశ్రామిక వినియోగానికి సరఫరా చేసే డీజిల్ ధర లీటరుకు సుమారు రూ. 40 వరకు అధికంగా ఉంది. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో డీజిల్‌ను కొనుగోలు చేసి, పరిశ్రమలకు మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఈ అక్రమ రవాణా కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వినియోగదారులకు డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి తాత్కాలిక ఆంక్షలను కఠినతరం చేసింది.
జులై 1 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా క్రమబద్ధీకరించబడటంతో పాటు, దేశీయంగా ఇంధన నిల్వలు.. సరఫరా గొలుసు స్థిరంగా సాగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో జూన్ 12 నాటి ఆంక్షల ఉత్తర్వులను ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకుంది. జులై 1 నుంచి ఇండియన్ ఆయిల్ , భారత్ పెట్రోలియం , హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలకు చెందిన అన్ని రిటైల్ ఔట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలాంటి పరిమితులు లేకుండా యథావిధిగా సాగుతాయి.
ఎవరెవరికి ఊరట?
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా కింది రంగాలకు పెద్ద ఉపశమనం లభించనుంది. లారీలు, ట్రక్కులు, ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు ఇకపై నిరంతరాయంగా ప్రయాణాలు సాగించవచ్చు. రోజువారీ రవాణా అవసరాల కోసం లీటర్ల కొద్దీ ఇంధనం కావాల్సిన వారికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. ఇంధన కొరత వస్తుందేమోననే ఆందోళనలు, అనుమానాలకు ఈ నిర్ణయంతో పూర్తిగా తెరపడింది.
మొత్తానికి ప్రభుత్వ ముందస్తు వ్యూహం వల్ల దేశంలో చమురు సంక్షోభం తలెత్తకుండా నివారించడమే కాకుండా సకాలంలో ఆంక్షలు ఎత్తివేసి మార్కెట్‌ను సాధారణ స్థితికి తీసుకురావడం విశేషం.
