వాత నుంచి ఉపశమనం.. ఎన్నాళ్లకో మంచి నిర్ణయం మోడీజీ
దీని ప్రకారం.. వ్యక్తిగత జీవిత.. ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించిన ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
By: Garuda Media | 21 Aug 2025 9:40 AM ISTకీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఒకే దేశం.. ఒకే పన్ను పేరుతో జీఎస్టీని తీసుకురావటం.. అది.. ఇది అన్న తేడా లేకుండా ప్రతి అంశానికి జీఎస్టీ బాదుడుతో ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. చివరకు బీమా సేవలకు సంబంధించిన ప్రీమియంపైనా జీఎస్టీ బాదుడుపై ప్రజల్లో తీవ్ర అసంత్రప్తి ఉంది. ఇలాంటి వేళ.. కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
దీని ప్రకారం.. వ్యక్తిగత జీవిత.. ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించిన ప్రీమియంను జీఎస్టీ నుంచి మినహాయించేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బీమాపై ఏర్పాటైన మంత్రుల టీం కన్వీనర్ సామ్రాట్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం జీవిత బీమా.. ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం పన్నును బాదేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన జీరో జీఎస్టీకి అన్ని రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
కేంద్ర ప్రతిపాదన ద్వారా కలిగే ప్రయోజనాన్ని వినియోగదారులకు చేరేలా చూడాలన్న సూచన పలువురు రాష్ట్ర మంత్రులు కోరినట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన విధానాన్నిజీఎస్టీ మండలి నిర్ణయిస్తుందన్న ఆశా భావం వ్యక్తమవుతోంది. తాజా ప్రతిపాదనతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు లభించే వార్షిక పన్ను రాబడి భారీగా తగ్గనుంది. ఒక అంచనా ప్రకారం పన్నురాబడి రూ.10వేల కోట్లు (రూ.9,700 కోట్లు) తగ్గుతుందని చెబుతున్నారు. 18 శాతం ప్రీమియం తగ్గటం ఆరోగ్య, వ్యక్తిగత బీమా వినియోగదారులకు భారీ ఉపశమనం లభిస్తుందని చెప్పక తప్పదు.
