Begin typing your search above and press return to search.

దక్షిణాదికి తప్పిన గండం.. కేంద్రం నిర్ణయంతో సేఫ్

పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి.

By:  Satya P   |   24 March 2026 5:28 PM IST
దక్షిణాదికి తప్పిన గండం.. కేంద్రం నిర్ణయంతో సేఫ్
X

పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలు ఊపిరి పీల్చుకున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలకూ ఒకేశాతం మేర నియోజకవర్గాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను విభజిస్తామని కేంద్రం ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం డీలిమేటేషన్ ప్రక్రియను సునాయాశంగా పూర్తయ్యేలా చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం ఎప్పటి నుంచో భావిస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచలేదు. కానీ, దేశ జనాభా పెరిగిపోవడంతో ఈ సారి నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని కేంద్రం భావించింది. గత ఎన్నికలకు ముందు కొత్తగా జనాభా లెక్కలు సేకరించి, జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పెంచాలని నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ప్రతిపాదించినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పార్టీలకు అతీతంగా అంతా దీనిని వ్యతిరేకించారు.

దేశంలోఅమలు చేసిన జనాభా నియంత్రణ విధానాన్ని పక్కాగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు జనాభాను అదుపు చేయగా, ఉత్తరాది మాత్రం జనాభాను నియంత్రించలేకపోయింది. దీంతో దేశంలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య జనాభా వ్యత్యాసం తీవ్రంగా ఉంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పెంచితే ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో దక్షిణాదిలో కొత్తగా నియోజకవర్గాలు పెరగకపోగా, ప్రస్తుతం ఉన్న స్థానాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించాలనే కేంద్రం ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందని అంటున్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి సొంతంగా బలం లేకపోవడం దక్షిణాదికి చెందిన టీడీపీ, జనసేన పార్టీల మద్దతుపై ఆధారపడటం వల్ల కేంద్రం తన ఆలోచన మార్చుకుందని అంటున్నారు.

2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని పునర్విభజన చేయాలని భావించినా, ప్రస్తుతం ఉన్న సీట్లు ఆధారంగా అన్ని రాష్ట్రాలకూ ఒకే శాతం మేర సీట్లు పెంచాలని కేంద్రం భావించినట్లు చెబుతున్నారు. దీంతో దేశంలో మొత్తం లోక్ సభ స్థానాల సంఖ్య 50 శాతం పెరిగి 816కు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో వరకు వస్తే ఏపీలో 25 స్థానాలు 37 నుంచి 38కి పెరగనున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో లోక్ సభ సీట్లు 25 లేదా 26 అయ్యే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.