విమానాల్లో ఈ20 ఇంధనం? కేజ్రీవాల్ వ్యాఖ్యలపై రామ్ మోహన్ నాయుడు ఘాటు స్పందన
విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)లో 20 శాతం ఇథనాల్ (ఈ20) కలపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ వస్తున్న వార్తలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తీవ్రంగా ఖండించారు.
By: A.N.Kumar | 7 Aug 2026 12:36 AM ISTవిమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)లో 20 శాతం ఇథనాల్ (ఈ20) కలపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ వస్తున్న వార్తలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ తరహా ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. విమానయాన భద్రత వంటి అత్యంత సున్నితమైన.. కీలకమైన అంశాలపై ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయడం తీవ్ర బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు.
ఈ వివాదానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలే ప్రధాన కారణమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సాధారణ వాహనాల తరహాలోనే విమానాల్లో వినియోగించే ఇంధనంలో కూడా ఇథనాల్‌ను కలపాలని చూస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమైంది. కేజ్రీవాల్ ఆరోపణలపై తక్షణమే స్పందించిన కేంద్ర మంత్రి.. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏది లేదని.. అసలు ఆ దిశగా ఎలాంటి ఆలోచన కూడా చేయలేదని తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా సాంకేతిక అంశాలపై మంత్రి పూర్తి స్పష్టతనిచ్చారు. విమానాల్లో వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), పర్యావరణహితమైన సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్.ఏ.ఎఫ్), అలాగే సాధారణ ఇంధనాల్లో కలిపే ఇథనాల్ ఇవన్నీ కూడా మూడు పూర్తిగా వేర్వేరు అంశాలని ఆయన వివరించారు. ముఖ్యంగా ఇథనాల్‌ను విమాన ఇంధనంతో కలిపే ప్రసక్తే లేదని.. దీనిపై ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రయాణికులలో అనవసర భయాందోళనలు సృష్టించేందుకు కొందరు కావాలని చేస్తున్న ప్రయత్నమిదని ఆయన ధ్వజమెత్తారు.
అదే సమయంలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్.ఏ.ఎఫ్) గురించి పౌర విమానయాన శాఖ మంత్రి విస్తృతమైన వివరణ ఇచ్చారు. ఎస్.ఏ.ఎఫ్ అనేది ఇథనాల్‌కు పూర్తిగా భిన్నమైనదని... అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన విమాన ఇంధనమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంలో భాగంగానే ఎస్.ఏఎఫ్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని.. దీని వినియోగానికి ముందు కఠినమైన భద్రతా పరీక్షలు.. శాస్త్రీయ ధ్రువీకరణలు ఉంటాయని వివరించారు.
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ గుర్తింపు పొందిన భద్రతా ప్రమాణాల ప్రకారమే ఎస్.ఏఎఫ్ వినియోగం జరుగుతోందని.. ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాలు దశలవారీగా దీనిని విజయవంతంగా అమల్లోకి తెచ్చాయని రామ్ మోహన్ నాయుడు వెల్లడించారు. భారతదేశంలో కూడా విమానయాన రంగంలో ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని.. ఏ విషయంలోనూ రాజీపడే ప్రసక్తే ఉండదని పునరుద్ఘాటించారు. ప్రతి నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలు, శాస్త్రీయ పరిశోధనల ఆధారంగానే అమలవుతుందని చెప్పారు.
విమాన భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం వల్ల ప్రయాణికుల్లో లేనిపోని భయాలు పెరుగుతాయని మంత్రి హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందే వదంతులను.. ప్రచారాలను గుడ్డిగా నమ్మకుండా.. కేవలం ప్రభుత్వం ఇచ్చే అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విమాన ప్రయాణికుల ప్రాణ భద్రతే కేంద్ర ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని మరోసారి స్పష్టం చేశారు.
