'బంగారు' భవిష్యత్తు ఆశించి పోతే... మృత్యుకూపంలో కలిసిన నూరేళ్ల ఆయుష్షు! 100 మందికి పైగా సమాధి
ఆశల వేటలో చీకటి సొరంగాల్లోకి అడుగుపెట్టిన ఆ పేద బతుకులను మృత్యువు మట్టిరూపంలో వచ్చి మింగేసింది.
By: A.N.Kumar | 20 Aug 2026 10:01 AM ISTఆశల వేటలో చీకటి సొరంగాల్లోకి అడుగుపెట్టిన ఆ పేద బతుకులను మృత్యువు మట్టిరూపంలో వచ్చి మింగేసింది. కుటుంబాల ఆకలి తీర్చడానికి.. పసిపిల్లల భవిష్యత్తును బంగారంగా మార్చుకోవడానికి చేసిన కష్టమే వారి పాలిట నూరేళ్ల శాపమైంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ మట్టి మేటల కింద శ్వాస ఆడక.. కనీసం చివరి చూపుకూ నోచుకోక వందలాది ప్రాణాలు మట్టిలోనే కలిసిపోయిన తీరు గుండెలను పిండేస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ అభాగ్యుల ఇళ్లలో ఇప్పుడు బంగారు భవిష్యత్తు బూడిదై.. మిగిలింది కేవలం ఆరని కన్నీళ్లు.. తీరని గుండెకోత మాత్రమే..
ఆఫ్రికాలోని సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ ప్రాంతంలోని ఓ బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలడంతో వంద మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది వెల్లడించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా.. మరికొందరు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.
జాంబోయే గ్రామంలో దుర్ఘటన
కెమెరూన్ సరిహద్దుకు సమీపంలోని నానా-మాంబెరే ప్రిఫెక్చర్‌లో ఉన్న జాంబోయే గ్రామంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ చిన్న స్థాయిలో సంప్రదాయ పద్ధతుల్లో బంగారం తవ్వకాలు నిర్వహిస్తున్నారు. గనిలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో భారీగా మట్టి.. ఇసుక ఒక్కసారిగా కూలిపోవడంతో వారు దాని కింద చిక్కుకుపోయారు. గని సొరంగాలు కూలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెడ్‌క్రాస్ వాలంటీర్లు, స్థానిక రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఇప్పటివరకు వందకు పైగా మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. పలువురు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
రెడ్‌క్రాస్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న గెర్వైస్ గనాగొరోహ్ మాట్లాడుతూ.. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. జాంబోయే యువజన మండలి సభ్యుడు బెర్ట్రాండ్ బే యాంగ్వే మాట్లాడుతూ.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీయడం అద్భుతమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను ఆదుకోవాలనే ఆశతో గనుల్లో పనిచేస్తున్న యువత ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదమని అన్నారు.
ప్రమాదంపై దర్యాప్తు
ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గని నిర్వహణకు బాధ్యులెవరు? భద్రతా ప్రమాణాలు పాటించారా? ఈ ప్రమాదంలో నేరపూరిత నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే అంశాలపై విచారణ చేపట్టారు. మృతుల గుర్తింపు ప్రక్రియను కూడా అధికారులు కొనసాగిస్తున్నారు.
భద్రతా ప్రమాణాలు లేకపోవడమే కారణమా?
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో చిన్నతరహా బంగారు గనుల్లో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో వేలాది మంది ప్రజలు సరైన భద్రతా ఏర్పాట్లు లేని గనుల్లో పనిచేస్తున్నారు. సొరంగాల పటిష్ఠత, రక్షణ పరికరాలు, భద్రతా నియమాలు వంటి అంశాలను పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
జాంబోయేలో జరిగిన తాజా ప్రమాదం మరోసారి ఆ ప్రాంతంలోని చిన్నతరహా గనుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాలు, మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
