విజయ్‌తో తల గోక్కుంటున్న డీఎంకే
రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెడదామని అధికార పార్టీ, ప్రభుత్వం చేసే ప్రయత్నాలు కొన్ని బూమరాంగ్ అవ్వడం చూస్తుంటాం.
By: Garuda Media | 7 Jan 2026 5:54 PM ISTరాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెడదామని అధికార పార్టీ, ప్రభుత్వం చేసే ప్రయత్నాలు కొన్ని బూమరాంగ్ అవ్వడం చూస్తుంటాం. అందులోనూ సినిమాలు చేయడం ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించిన వాళ్లు రాజకీయాల్లోకి వచ్చినపుడు వారి మీది అధికార జులుం ప్రదర్శించాలని భావిస్తే జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయి.
2019-24 మధ్య పవన్ కళ్యాణ్‌ను ఇలాగే ఇబ్బంది పెట్టబోయి వైసీపీ గట్టి ఎదురు దెబ్బ తింది. పవన్ విశాఖ పర్యటనకు వెళ్లినపుడు నిర్బంధించడం.. ఇప్పటం ఇష్యూలో ఇరుకున పెట్టాలని చూడడం.. పవన్ సినిమాలు రిలీజైనపుడు అడ్డంకులు సృష్టించడం లాంటి పరిణామాలు.. పవన్‌కు జనాల్లో సానుభూతి పెరిగేలా చేశాయి. అధికార పార్టీ మీద వ్యతిరేకతను పెంచాయి. ఇప్పుడు తమిళనాట కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’కు ఎదురవుతున్న అడ్డంకులను చూస్తుంటే.. దీని వెనుక అధికార పార్టీ, ప్రభుత్వాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు ఎంతకీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం, చిత్రమైన కొర్రీలు వేస్తుండడం.. ఓవైపు విజయ్ తన చివరి చిత్రం రిలీజ్ హడావుడిలో ఉండగా.. కరూర్ విషాదానికి సంబంధించి విచారణకు పిలవడం సందేహాలను పెంచుతున్నాయి. ‘జననాయగన్’ రిలీజ్‌కు ఇంకో రెండు రోజులే సమయం ఉండగా.. ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం, దీనిపై కోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో విజయ్ అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
ఐతే విజయ్‌ని ఇరుకున పెట్టడం ఏమో కానీ.. ఈ పరిణామాలు జనాల్లో డీఎంకే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుతాయనే చర్చ జరుగుతోంది. విజయ్ పట్ల జనాల్లో సానుభూతిని పెంచి అతణ్ని హీరోను చేస్తున్నారని.. ఇది అంతిమంగా డీఎంకేకు నష్టం చేస్తుందని.. ఏపీలో పవన్ కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందో చూశాక కూడా డీఎంకే ఈ తప్పు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
