జ్ఞానేశ్ కుమార్ పర్యటనలు వాయిదా...ఎందువల్ల ?
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి పర్యటనలు అంటే షెడ్యూల్ రిలీజ్ చేస్తే కచ్చితంగా ఉంటాయి.
By: Satya P | 8 Oct 2026 9:01 AM ISTకేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ అధికారిక పర్యటనలు వరసగా వాయిదా పడుతున్నాయి. దాంతో ఎందువల్ల ఏమిటి అన్న కొత్త చర్చ మొదలైంది. ఒక వైపు అయితే గత వారం రోజులుగా దేశ రాజధానిలో విపక్షాలు సీఈసీ రాజీనామా అంటూ ఆందోళన చేస్తున్నాయి. తాజా పరిణామాలతో రాజకీయం సైతం వేడెక్కిపోతోంది. ఈ నేపథ్యం నుంచి చూసినపుడు సీఈసీ పర్యటనలు వాయిదా పడడం మీద కూడా చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇంతకీ అసలు ఏమి జరుగుతోంది అని అంతటా బిగ్ డిబేట్ అయితే సాగుతోంది.
వరుసగా రెండు సార్లు :
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి పర్యటనలు అంటే షెడ్యూల్ రిలీజ్ చేస్తే కచ్చితంగా ఉంటాయి. పోనీ ఎక్కడైనా ఏదైనా అనివార్యత ఉంటే వాయిదా పడిన సందర్భాలు ఉంటాయి. కానీ వరుసగా రెండు సార్లు వాయిదాలు పడడంతో అసలు ఏమిటి ఇది అన్నది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా చూస్తే అక్టోబర్ 7, 8 తేదీలలో దంతెవాడ, బస్తర్, కవర్ధా వంటి ప్రాంతాలలో జ్ఞానేశ్ కుమార్ పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన సీఈసీ పర్యటన వాయిదా పడినట్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఇది ఒక్కటే కాదు గత నెల చివరిలో ఆయన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ వారణాసి, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ లలో కూడా అధికారిక పర్యటనలు చేపట్టాల్సి ఉండగా అవి సైతం చివరి నిముషంలో వాయిదా పడ్డాయి.
ఆందోళన పర్వంతో :
ప్రస్తుతం దేశంలో విపక్షాలు అన్నీ కలసి ఏకైక అజెండాగా తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. భారీ ఎత్తున ఉద్యమిస్తున్నాయి. ఇపుడు సీజేపీ కూడా తోడు అవుతోంది. రానున్న రోజులలో ఈ ఆందోళనలు మరింతగా ఉధృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అయితే తమ డిమాండ్లలో ఎక్కడా రాజీ లేదని కూడా స్పష్టం చేస్తోంది. ఒక విధంగా దేశ రాజధాని అయితే ఉద్రిక్తతలతో నిండిపోయింది. మరో వైపు సుప్రీం కోర్టులో ఈసీ మీద పిటిషన్లు పడ్డాయి. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జ్ఞానేశ్ కుమార్ అధికారిక పర్యటనల వాయిదాల మీద చర్చ మరో విధంగా కూడా సాగుతోంది.
ఎన్నికల సంఘం వివరణ:
అయితే సీఈసీ అధికారిక పర్యటనల వాయిదాలకు ప్రస్తుతం దేశంలో సాగుతున్న వివాదాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇస్తోంది. ఇదంతా కేవలం పరిపాలనాపరమైన కారణాలుగానే స్పష్టతను ఇస్తోంది. స్థానిక పరిస్థితుల రీత్యా షెడ్యూల్‌ను మార్చడం సాధారణ ప్రక్రియేనని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు జ్ఞానేశ్ కుమార్ అధికారిక పర్యటనకు సంబంధించిన కొత్త తేదీలను ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించనుందని కూడా వెల్లడిస్తున్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం రాజకీయ పోరాటాలు అన్నీ కూడా సీఈసీ రాజీనామా మీదనే సాగుతున్నాయి. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మీద అలాగే ఫారం 6 మార్పులపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరి ఈ నిరసనల ఎఫెక్ట్ తోనే పర్యటనలు వాయిదా పడుతున్నాయా అన్న చర్చ అయితే ఉంది. కానీ ఎన్నికల సంఘం మాత్రం వివరణ ఇస్తోంది.
