Begin typing your search above and press return to search.

ర్యాంప్ పై అందగత్తెలను వణికించిన భారీ భూకంపం.. వీడియో వైరల్!

ఫిలిప్పీన్స్‌ లో భారీ భూకంపం సంభవించింది. సెబులో జరిగిన మిస్ ఆసియా – పసిఫిక్ ఇంటర్నేషనల్ - 2025 జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా శక్తివంతమైన భూకంపం సంభవించింది.

By:  Raja Ch   |   2 Oct 2025 11:53 AM IST
ర్యాంప్  పై అందగత్తెలను వణికించిన భారీ భూకంపం.. వీడియో వైరల్!
X

ఫిలిప్పీన్స్‌ లో భారీ భూకంపం సంభవించింది. సెబులో జరిగిన మిస్ ఆసియా – పసిఫిక్ ఇంటర్నేషనల్ - 2025 జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో అంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఫలితంగా... అందమైన, ఆకర్షణీయమైన సాయంత్రంగా భావించింది కాస్తా.. భయం భయంగా, గందరగోళంగా మారింది.

అవును... సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.9గా నమోదైంది. ఆ సమయంలో రాడిసన్ బ్లూ సెబు హోటల్‌ లో రన్‌ వేపై అందగత్తెలు క్యాట్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో అంతా భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సెబు ప్రావిన్సులోని సుమారు 90,000 జనాభా ఉన్న బోగో నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. దాని తీవ్రతకు 69 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది గాయపడ్డారు. బోగో నగరంలోనే ఎక్కువ మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నగరంలోని అనేక ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ సందర్భంగా స్పందించిన జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ... భూకంపం కారణంగా 69 మంది మృతి చెందారని, సుమారు 150 మంది గాయపడ్డారని తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. బోగో భూకంపం నేపథ్యంలో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసి, తర్వాత ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతానికి సునామీ భయం అవసరం లేదని వెల్లడించారు.

ఈ నేపథ్యలోనే అంతర్జాతీయ అందాల పోటీలకు ఈ ఆకస్మిక భూకంపం అంతరాయం కలిగించింది. దీంతో అభిమానులు, నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భూకంపం సంభవించిన కొన్ని గంటల స్పందించిన మిస్ ఆసియా - పసిఫిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్.. ప్రతినిధులు, సిబ్బంది ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ సందర్భంగా మిస్ ఫిలిప్పీన్స్ ఆర్గనైజేషన్ సంఘీభావ సందేశాన్ని జారీ చేసింది. ఇందులో భాగంగా... ఈ దుఃఖం సమయంలో తాము సెబులోని సోదరులు, సోదరీమణులతో నిలబడతామని.. వారుకీ స్ఫూర్తిని నిలబెట్టడం కొనసాగిద్దామని.. బలమైన, సురక్షితమైన సంఘాలను పునర్నిర్మించడానికి కృషి చేద్దామని పేర్కొంది.

దేశాన్ని కుదిపేసిన ఈ భూకంపం వల్ల విద్యుత్తు అంతరాయంతో పాటు కొన్ని నివాస సముదాయాలు, వ్యాపార భవనాలు, చర్చ్ లు, వంతెనలు కూలిపోయాయి. ఇది ఈ సంవత్సరం దేశంలో అత్యంత వినాశకరమైన విపత్తులలో ఒకటిగా గుర్తించబడింది.

మరోవైపు భూకంపం వల్ల ప్రభావితమైన వారి కుటుంబాలకు ఫిలిప్పీన్స్‌ లోని భారత రాయబార కార్యాలయం సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో భాగంగా... సెబు ప్రావిన్స్‌ లోని భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు, ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి భారత రాయబార కార్యాలయం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది అని పేర్కొంది.