బిగ్ అలర్ట్... లక్ష పైన సీసీ కెమెరాలు హ్యాక్.. ఫుటేజ్ తో ఏమి చేస్తున్నారంటే..!
ఈ సందర్భంగా నిందితులు సాధారణ పాస్ వర్డ్ వంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్ దుర్భలత్వాన్ని ఉపయోగించుకున్నారని పోలీసులు తెలిపారు.
By: Raja Ch | 3 Dec 2025 12:00 AM ISTఈ రోజుల్లో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అవసరాల కోసం ఫోన్ వాడితే దాని నుంచి సైబర్ నేరం, డబ్బులు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేస్తే అటు నుంచి మోసం.. ఇక ఆఖరికి సెక్యూరిటీ నిమిత్తం ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు పెట్టుకున్నా వాటినీ హ్యాక్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇలాంటి పనికి పూనుకున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అవును... దక్షిణ కొరియాలో ఇళ్లు, వ్యాపార స్థలాల్లోని సుమారు 1,20,000కి పైగా సీసీ కెమెరాలను హ్యాక్ చేసి, ఆ ఫుటేజీని ఉపయోగించి విదేశీ వెబ్ సైట్ కోసం లైంగిక దోపిడీ విషయాలను తయారు చేశారనే ఆరోపణలపై నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఫుటేజీల నుంచి వీరు వందల సంఖ్యలో లైంగిక దోపిడీ వీడియోలు తయారు చేశారని చెబుతున్నారు.
ఈ సందర్భంగా నిందితులు సాధారణ పాస్ వర్డ్ వంటి ఇంటర్నెట్ ప్రోటోకాల్ దుర్భలత్వాన్ని ఉపయోగించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో హ్యాక్ చేయబడిన కెమెరాల ప్రదేశాలలో ప్రైవేట్ హౌస్ లు, హోటల్స్, స్టూడియోలు, గైనకాలజిస్ట్ క్లీనిక్ లు ఉన్నాయని చెబుతున్నారు. అయితే తాజాగా అరెస్ట్ అయిన నలుగురిలో ఒకరికిఒకరు సంబంధం లేని వ్యక్తులని వెల్లడించారు.
ఈ క్రమంలో అరెస్ట్ కాబడినవారిలో ఒకరు సుమారు 63,000 కెమెరాలను హ్యాక్ చేశారని.. ఈ క్రమంలో వాటి నుంచి 545 లైంగిక దోపిడీ వీడియోలను తయారు చేసాడని.. వాటిని సుమారు 35 మిలియన్ వోన్ లకు అమ్మేశాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి 70,000 కెమెరాలు హ్యాక్ చేసి, వాటిద్వారా 648 వీడియోలు చేసి వాటిని 18 మిలియన్ వోన్ లకు విక్రయించారని తెలిపారు!
ఈ సందర్భంగా స్పందించిన నేషనల్ పోలీస్ ఏజెన్సీ లో సైబర్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ పార్క్ వూ హ్యూన్... ఈ ఫుటేజీని చట్టవిరుద్ధంగా పంపిణీ చేసిన వెబ్ సైట్ లో గత ఏడాది పోస్ట్ చేయబడిన సుమారు 62% వీడియోలకు ఈ ఇద్దరూ బాధ్యులని తెలిపారు. ఆ వెబ్ సైట్ ను మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దాని ఆపరేటర్ ను దర్యాప్తు చేయడానికి పలు విదేశీ ఏజెన్సీలు సహకరిస్తున్నాయని అన్నారు.
ఇదే సమయంలో... ప్రధానంగా ఇళ్లల్లో, వ్యాపార ప్రాంగణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నవారు అప్రమత్తంగా ఉండాలని.. వాటికి సంబంధించిన యాక్సెస్ పాస్ వర్డ్ లను రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలని నేషనల్ పోలీస్ ఏజెన్సీ తన ప్రకటనలో తెలిపింది.
