కర్ణాటకలో పొలిటికల్ బిజినెస్.. సిద్ధూ రాజీనామాతో ‘కాఫీ డే’ ఇన్వెస్టర్ల పండుగ! ఎందుకంటే..
కర్ణాటకకు చెందిన ప్రముఖ కాఫీ చైన్ కంపెనీ కేఫ్ కాఫీ డే (సీసీడీ) షేర్లు భారీగా పెరగడం ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Political Desk | 30 May 2026 1:29 PM ISTకర్ణాటకకు చెందిన ప్రముఖ కాఫీ చైన్ కంపెనీ కేఫ్ కాఫీ డే (సీసీడీ) షేర్లు భారీగా పెరగడం ఆ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా ప్రకటించగానే ఇన్వెస్టర్లు కేఫ్ కాఫీ డే షేర్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపడంతో ఆ షేరు ఏకంగా 29 శాతం అప్పర్ సర్కూట్ అయిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సహజంగా దేశ రాజకీయాల్లో మార్పులు సంభవించే సమయంలో స్టాక్స్ లో మార్పులు జరుగుతుంటాయని అంటున్నారు. కానీ, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారతారనే సమాచారంతో ఒక సంస్థ షేరు లాభాలు గడించడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే కేఫ్ కాఫీ డే షేరు పెరగడానికి కర్ణాటకలో చోటుచేసుకున్న రాజకీయ మార్పులే ప్రధాన కారణంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం ఆ సంస్థతో కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అనుబంధం ఉండటమే అంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా ప్రకటించడం, ఆయన స్థానంలో డీకే సీఎం అవ్వనున్నారనే సమాచారంతో కేఫ్ కాఫీ డే (CCD)ని నిర్వహించే 'కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్' షేర్లు ఏకంగా 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకిందని అంటున్నారు. ఈ నెల 29న రూ. 34.78 వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టిందని చెబుతున్నారు.
డీకే శివకుమార్ సక్సెస్.. CCDకి ప్లస్?
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య దిగిపోవడంతో, తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్‌కు కేఫ్ కాఫీ డే (CCD) కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. CCD వ్యవస్థాపకుడు, దివంగత వి.జి. సిద్ధార్థ కుమారుడైన అమర్త్య హెగ్డేకు.. డీకే శివకుమార్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ఇచ్చి వివాహం చేశారు. ఈ బంధం కారణంగానే, శివకుమార్ సీఎం కాబోతున్నారనే వార్త రాగానే కాఫీ డే షేర్లపై ఇన్వెస్టర్లు విపరీతమైన నమ్మకాన్ని చూపించారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
లాభాల్లోకి దూసుకొచ్చిన కాఫీ డే
రాజకీయ పరిణామాలు ఇలా ఉంటే, కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా షేర్ల పెరుగుదలకు మరో కారణమ్యాయని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాల్లో కేఫ్ కాఫీ డే అద్భుతమైన రికవరీని సాధించిందని గుర్తు చేస్తున్నారు. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ. 114.16 కోట్ల నెట్ లాస్‌లో ఉన్న కంపెనీ, ఈసారి ఏకంగా రూ. 132.07 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అలాగే కంపెనీ రెవెన్యూ కూడా 4.6 శాతం పెరిగి రూ. 280.51 కోట్లకు చేరుకుంది. ఇక ప్రస్తుతం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టమవ్వడం, మరోవైపు కంపెనీ నష్టాల నుంచి లాభాల్లోకి రావడం కలిసి వచ్చి కాఫీ డే షేర్లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని చెబుతున్నారు.
