Begin typing your search above and press return to search.

4వ తరగతి చిన్నారిపై ర్యాగింగ్.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని.. జైపూర్ లో విషాధకర ఘటన..

పాఠశాల అనేది పిల్లల కోసం సురక్షిత స్థలం కావాలి. నవ్వులు, ఆటలు, కలలు, భవిష్యత్తు ఇవి వెలిసే ప్రదేశం కావాలి.

By:  Tupaki Political Desk   |   21 Nov 2025 3:08 PM IST
4వ తరగతి చిన్నారిపై ర్యాగింగ్.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని.. జైపూర్ లో విషాధకర ఘటన..
X

పాఠశాల అనేది పిల్లల కోసం సురక్షిత స్థలం కావాలి. నవ్వులు, ఆటలు, కలలు, భవిష్యత్తు ఇవి వెలిసే ప్రదేశం కావాలి. కానీ జైపూర్‌లోని ఒక స్కూల్ లో మాత్రం భయంకరమైన వాతావరణం చోటు చేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల పాప స్కూల్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి తన ప్రాణం తీసుకుంది.

దేశం మొత్తం ఈ ఘటనను ‘షాక్’గా చూసింది. కానీ సీబీఎస్ఈ దర్యాప్తు నివేదిక చదివిన తర్వాత.. ఇది కేవలం షాక్ కాదు ఇది మన విద్యా వ్యవస్థ ముఖంపై పడిన ఒక చెంపదెబ్బ లాంటిదని తేలింది.

నీర్జామోదీ స్కూల్ లో..

జైపూర్‌లోని ప్రముఖ ‘నీర్జా మోదీ స్కూల్’ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న తొమ్మిదేళ్ల చిన్నారి ఉదంతం.. ఇది కేవలం ఒక విషాద ఘటన మాత్రమే కాదు.. ఇది ఆధునిక విద్యాలయాలు, తమ సురక్షిత గోడల వెనుక దాచుతున్న భయంకరమైన క్రూరత్వానికి నిదర్శనం. పసి మనసుల ఆటపాటలకు నిలయం కావాల్సిన స్కూల్, ఆ చిన్నారికి 18 నెలల పాటు తీరని వేధింపులు, వెకిలి మాటలతో నిండిన నరకకూపంగా మారిందంటే మన సమాజం, విద్యావ్యవస్థ ఏ స్థాయికి దిగజారాయో అర్థం అవుతుంది. ఆ చిన్నారి గుండె పగిలి చేసిన చివరి కేకను, వ్యవస్థ మొత్తం వినలేకపోయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రిపోర్ట్ వెల్లడించిన నిజాలు – క్షణికావేశంలో జరిగిన ఈ దుర్ఘటన వెనుక టీచర్లు, యాజమాన్యం ప్రదర్శించిన అమానవీయ నిర్లక్ష్యం ఎంతవరకు ఉందో స్పష్టం చేస్తున్నాయి.

నిర్లక్ష్యమే నరకానికి దారి

ఈ ఘోరంపై సీబీఎస్ఈ దర్యాప్తు నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. స్కూల్ యాజమాన్యం, క్లాస్ టీచర్ ఘోర నిర్లక్ష్యాన్ని బయట పెట్టింది. ‘తమ బిడ్డను వేధింపుల నుంచి కాపాడాలి’ అని తల్లిదండ్రులు పదే పదే మొరపెట్టుకున్నా, ఆ ఫిర్యాదులు టీచర్ల చెవికి చేరలేదు. ‘మా పాపను ఏడిపిస్తున్నారు, కాపాడండి’ అన్న ఆర్తనాదం వారికి ప్రతి రోజు చేసే ఒక చిన్న కంప్లయింట్ గా కనిపించిందే తప్ప, ఒక పసి మనసు పడుతున్న క్షోభగా గుర్తించలేకపోయారు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన స్కూల్ యాజమాన్యం తీరు.. తమ బాధ్యత పట్ల వారికి ఎంత అలక్ష్యం ఉందో తెలియజేస్తోంది. ‘ఒక ఇన్నోసెంట్ చైల్డ్’ ప్రాణాన్ని కాపాడడంలో స్కూల్ పూర్తిగా విఫలమైందన్న రిపోర్ట్, ఈ విషాదానికి ప్రధాన బాధ్యులు ఎవరో తేల్చిచెప్పింది. తోటి విద్యార్థుల వెకిలి చేష్టలు, ఆఖరి రోజు జరిగిన వాగ్వాదం ఆ పసి మనసుపై చూపిన తీవ్ర మానసిక ఒత్తిడి.. చివరికి ఆత్మహత్యకు దారి తీసింది.

డొల్లబారిన భద్రతా గోడలు

స్కూల్ భద్రత కూడా డొల్లతనం అని బయటపడింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని క్లాస్‌రూమ్‌లో ఉన్న బాలిక ఎలా నాలుగో అంతస్తు వరకు వెళ్లగలిగింది? ఆమె ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించినా ఎవరూ ఎందుకు గమనించలేదు? ప్రమాదాలు జరగకుండా ఉండాల్సిన సేఫ్టీ ఎందుకు లేవు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో యాజమాన్యం విఫలమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ, నిఘా వైఫల్యం కారణంగా ఒక అమాయకురాలి ప్రాణం పోయింది. ర్యాగింగ్ అనేది కేవలం కాలేజీల్లోనో, పెద్దవారి మధ్యనో జరిగే విషయం కాదు, పసిపిల్లల ప్రపంచంలోనూ ఎంతటి క్రూరత్వానికి దారి తీస్తుందో ఈ ఉదంతం కళ్లకు కట్టింది.

మేల్కొనాల్సిన సమయం

ఈ దుర్ఘటన మన విద్యా వ్యవస్థకు ఒక గట్టి హెచ్చరిక. స్కూల్ అంటే కేవలం చదువు చెప్పే ప్రదేశం మాత్రమే కాదు.. పిల్లలకు మానసిక భద్రత.., సామాజిక విలువలను నేర్పే తొలి పాఠశాల. ఫిర్యాదులను పెడచెవిన పెట్టే టీచర్ల నిర్లక్ష్యం, సేఫ్టీ నెట్‌లను ఏర్పాటు చేయని యాజమాన్యాల అజాగ్రత్త.. ఇవన్నీ కలిసి ఒక నిండు బాల్యాన్ని బలితీసుకున్నాయి. ఇప్పటికైనా స్కూల్స్ ర్యాగింగ్, వేధింపుల విషయాల్లో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలి.

కేవలం రిపోర్టులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, ఇలాంటి వేధింపులకు కారణమైన పిల్లలకు, పట్టించుకోని టీచర్లకు కఠిన శిక్షలు అమలు చేయాలి. అప్పుడే, ఆత్మహత్య చేసుకున్న ఆ చిన్నారి ఆత్మకు న్యాయం జరుగుతుంది, ఇంకెందరో చిన్నారులు ఈ భయానక వాతావరణం నుంచి రక్షించబడతారు. ప్రతి పాఠశాల ప్రాంగణం, చిన్నారుల పాలిట సురక్షిత స్వర్గంగా మారాలి.