Begin typing your search above and press return to search.

విజయ్ కి భారీ షాక్.. సీబీఐ మళ్లీ నోటీసులు!

తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్.. అదే నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ జారీ చేసిన తాజా నోటీసులు.

By:  Madhu Reddy   |   9 March 2026 3:35 PM IST
విజయ్ కి భారీ షాక్.. సీబీఐ మళ్లీ నోటీసులు!
X

తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్.. అదే నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ జారీ చేసిన తాజా నోటీసులు. గత ఏడాది కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణ ముదురుతోంది. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ ముందు హాజరైన విజయ్, ఇప్పుడు మూడోసారి ఢిల్లీ వెళ్లాల్సి వస్తోంది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో వివాదాలు, మరోవైపు రాజకీయ భవిష్యత్తును శాసించే ఈ కేసు, ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను షేక్ చేస్తోంది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి? విజయ్‌ను సీబీఐ ఎందుకు పిలుస్తోంది? వివరాలు ఇలా వున్నాయి ..

కరూర్ తొక్కిసలాట.. అసలేం జరిగింది?

తమిళనాడులోని కరూర్‌లో 2025, సెప్టెంబర్ 27న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒక భారీ బహిరంగ సభ, రోడ్ షోను నిర్వహించింది. మధ్యాహ్నం ప్రారంభం కావాల్సిన ఈ ర్యాలీకి విజయ్ సుమారు 6 గంటలు ఆలస్యంగా రావడంతో జనం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వేల సంఖ్యలో జనం ఎండలో వేచి చూడటం, ఊపిరాడని పరిస్థితి నెలకొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇక ఈ దుర్ఘటనలో పిల్లలు, మహిళలతో సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా, 110 మందికి పైగా గాయపడ్డారు. విజయ్ తన బస్సుపై నుంచి నీళ్ల బాటిళ్లు విసురుతూ, అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని కోరిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక ఈ ఘోర ఘటనపై విచారణ బాధ్యతను సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.

సీబీఐ విచారణ.. అరెస్ట్ ప్రచారం:

ఈ కేసులో విజయ్‌ను సీబీఐ అధికారులు ఇప్పటికే 2026, జనవరి 12, 19వ తేదీల్లో సుదీర్ఘంగా విచారించారు. తాజాగా, మార్చి 10న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని విజయ్‌కు మరోసారి నోటీసులు అందాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఈసారి విచారణ తర్వాత విజయ్‌ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం తమిళ పాలిటిక్స్‌లో జోరుగా సాగుతోంది. ఇక ఒకవేళ ఇదే జరిగితే, కొత్తగా పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న విజయ్ రాజకీయ ప్రయాణంపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

వివాదాల సుడిగుండంలో విజయ్:

ప్రస్తుతం విజయ్ కేవలం ఈ ఒక్క కేసుతోనే కాకుండా వ్యక్తిగత వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు భార్యతో విడాకుల వివాదం నడుస్తుండగా, మరోవైపు నటి తో ఎఫైర్ ఉందంటూ వస్తున్న రూమర్లు ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో సీబీఐ నోటీసులు రావడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక కరూర్ తొక్కిసలాట ఘటన 41 మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో, బాధ్యులెవరనేది తేల్చేందుకు సీబీఐ పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు ఢిల్లీలో జరిగే విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని యావత్ తమిళనాడు మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.