Begin typing your search above and press return to search.

వైసీపీలో కేసుల 'స్కీమ్‌'!

వైసీపీ నాయ‌కుల‌పై వ‌రుస‌గా కేసులు న‌మోదవుతున్నాయి. అయితే.. ఇవేవీ ప్ర‌భుత్వం ప‌నిలేక వారిపై కేసులు పెట్ట‌డం లేదు.

By:  Garuda Media   |   3 Feb 2026 4:11 PM IST
వైసీపీలో కేసుల స్కీమ్‌!
X

వైసీపీ నాయ‌కుల‌పై వ‌రుస‌గా కేసులు న‌మోదవుతున్నాయి. అయితే.. ఇవేవీ ప్ర‌భుత్వం ప‌నిలేక వారిపై కేసులు పెట్ట‌డం లేదు. వైసీపీ నాయ‌కులు నోరు చేసుకుంటున్న నేప‌థ్యంలో.. దుర్భాషలాడుతున్న నేప థ్యంలో వారిపై కేసులు పెట్టాల్సి వ‌స్తోంద‌ని పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా మాజీ మంత్రులు విడ‌ద‌ల ర‌జ‌నీ, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిల‌పై మంగ‌ళ‌వారం పోలీసులు కేసులు న‌మోదు చేశారు.

నెల్లురు జిల్లా పొద‌ల‌కూరు, ద‌ర్గామిట్ట పోలీసు స్టేష‌న్ల‌లో మాజీ మంత్రి కాకాణిపై కేసులు న‌మోద‌య్యాయి. సీఎం చంద్ర‌బాబు.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిల‌పై కాకాణి దుర్భాష‌లాడార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అందుకే.. ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేశారు. ద‌ర్గామిట్ట పోలీసులు.. ఆయ‌న‌కు నోటీసులు కూడా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, కాకాణి వాటిని తీసుకోలేదు. దీంతో మ‌రో కేసు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

వాస్త‌వానికి ఇప్ప‌టికే.. కాకాణి చాలా రోజులు జైల్లో ఉండి వ‌చ్చారు. గ‌నుల అక్ర‌మాల కేసులో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక‌, ఇప్పుడు మ‌రోసారి కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేట‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ స‌హా ఆమె అ నుచ‌రుల‌పైనా పోలీసులు కేసులు న‌మోదు చేశారు. రెండు రోజుల కింద‌ట అంబ‌టి రాంబాబును అరెస్టు చేసిన స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ఆమె రోడ్డుపై బైఠాయించార‌ని.. త‌ద్వారా పోలీసుల విధుల‌కు ఆటంకం క‌లిగించార‌ని కేసులో వివ‌రించారు.

మ‌రోవైపు జోగి ర‌మేష్‌పైనా కేసులు పెట్టారు. ఇటీవ‌ల గ‌త రెండు రోజులుగా సీఎం, మంత్రి చంద్ర‌బాబు, నారా లోకేష్‌ల‌పై చేస్తున్న వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో జోగిపై పోలీసులు కేసు పెట్టారు. అయితే.. వైసీపీ అధినేత క‌నుస‌న్న‌ల్లోనే నాయ‌కులు నోరు చేసుకుంటున్నార‌న్న చ‌ర్చ సాగుతోంది. ఎంత మంది ఎక్కువ కేసులు పెట్టించుకుంటే.. వారికే గుర్తింపు అన్న‌ట్టుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. అందుకే అవ‌స‌రం లేక‌పోయినా.. నాయ‌కులు నోటికి ప‌ని చెబుతున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.