Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ జ్యోతిని వెలిగించటం వెనుకున్న చరిత్ర ఇదే

ఇజ్రాయెల్ దేశంలో అందించే అత్యుత్తమ గౌరవాల్లో ఒకటి తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ జ్యోతిని వెలిగించటంగా చెబుతారు.

By:  Garuda Media   |   5 Oct 2026 12:57 PM IST
ఇజ్రాయెల్ జ్యోతిని వెలిగించటం వెనుకున్న చరిత్ర  ఇదే
X

ఇజ్రాయెల్ దేశంలో అందించే అత్యుత్తమ గౌరవాల్లో ఒకటి తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ జ్యోతిని వెలిగించటంగా చెబుతారు. ఆ అవకాశాన్ని ఇజ్రాయెల్ ఉత్తినే ఇవ్వదు. దీనికి చాలానే ప్రాసెస్ ఉంటుంది. దీని ఎంపిక కూడా సాదాసీదాగా సాగదు. అలాంటి అత్యుత్తమ గౌరవాన్ని కెప్టెన్ స్మిత్ ముచ్ఛార్ కు అందజేస్తున్నట్లుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు స్వయంగా చెప్పటం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. కెప్టెన్ స్మిత్ కూడా పాల్గొని.. జ్యోతిని వెలిగిస్తారని చెప్పటం తెలిసిందే. ఇంతకూ జ్యోతిని ఎందుకు వెలిగిస్తారు? దాని వెనకున్న చరిత్ర ఏంటి? ఇజ్రాయెల్ దేశంలో అందించే అత్యున్నత గౌరవాల్లో ఇదొకటని భావించటానికి కారణమేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హీబ్రూ క్యాలెండర ప్రకారం ప్రతి ఏడాది ఏప్రిల్ లేదంటే మేలో వస్తుంది. వచ్చే ఏడాది అంటే 2027లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలు ఇజ్రాయెల్ దేశ 79వ వేడుకలుగా చెప్పాలి. దీన్ని వచ్చే ఏడాది మేలో నిర్వహించనున్నారు. జెరూసలేంలోని మౌంట్ హెర్జ్ల్ ప్లాజాలో జరగనుంది. ఆ దేశ సంప్రదాయం ప్రకారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు జెరూసలేం లోని మౌంట్ హెర్జ్ల్‌లో జాతీయ జెండాను ఎగురవేసి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఇజ్రాయెల్ చరిత్రలో బైబిల్ కాలం నాటి 12 తెగలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది పన్నెండు జ్యోతులను వెలిగిస్తారు. ఇజ్రాయెల్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముగిసి.. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ప్రారంభమయ్యే సంధి క్షణంలో ఈ జ్యోతులను వెలిగిస్తారు. సమాజానికి.. ఇజ్రాయెల్ దేశ రక్షణకు విశేష సేవలు అందించిన వారిని గుర్తించి ఈ గౌరవాన్నిఅందిస్తారు. జ్యోతిని వెలిగించే వారిని ఎంపిక చేయటానికి ఆ దేశంలో ప్రత్యేక ప్రాసెస్ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రధాని మౌఖికంగా చెప్పినా.. ఎంపిక కార్యక్రమం ఒక ప్రాసెస్ ప్రకారం సాగుతుంది.

ఆ దేశ నిబంధనల ప్రకారం జ్యోతిని వెలిగించే వారిని ఎంపిక చేసేందుకు ఒక ప్రత్యేక పబ్లిక్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి.. దానికి మంత్రిత్వ శాఖల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి అయితేనే ఆహ్వానం అధికారికంగా అందుతుంది. అయితే.. ఇజ్రాయెల్ ప్రధాని తాజా మాట ప్రకారం..జరగాల్సిన అధికారిక ప్రక్రియ అలా జరిగిపోతుంది. ఎందుకంటే.. ఇజ్రాయెల్ దేశానికి చెందిన వందలాది మంది పౌరుల ప్రాణాల్ని కాపాడిన వ్యక్తికి ఈ అత్యుత్తమ గౌరవాన్ని ఇచ్చేందుకు ఆ దేశానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. దీంతో.. వచ్చే ఏడాది మేలో జరిగే వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పైలట్ స్మిత్ కలిసి జ్యోతిని వెలిగించే చారిత్రక ఘట్టాన్ని చూసే వీలు ఉంటుంది.

దీని ప్రత్యేకత ఏమంటే.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దేశ చరిత్రలో ఈ జ్యోతిని వెలిగించే అవకాశం విదేశీయులకు వచ్చినా.. వారంతా ఆ దేశ అనుకూల దేశాధినేతలు.. విదేశాల్లో ఉన్న యూదు వంశస్థులే. అందుకు భిన్నంగా యూదు నేపథ్యం లేని ఒక సాధారణ విదేశీ పౌరుడికి.. కేవలం అతను చూపిన అసాధారణ మానవత్వం.. ప్రాణాలు అర్పించే సాహసానికి కృతజ్ఞతగా ఈ అత్యున్నత గౌరవాన్ని ఇజ్రాయెల్ ప్రకటించటం మాత్రం ఇదే తొలిసారిగా చెప్పాలి.

నిజానికి ఈ జ్యోతిని వెలిగించే గౌరవం కేవలం ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే ప్రత్యేకించిందని చెప్పాలి. ఈ జ్యోతిని వెలిగించే అవకాశాన్ని సాధారణంగా ఆ దేశంలోని సైనికులు.. సామాజిక కార్యకర్తలు.. విపత్కర పరిస్థితుల్లో ఇతరులను కాపాడిన సాధారణ వ్యక్తులను ఏటా ఎంపిక చేస్తారు. విదేశీయులకు ఆ అవకాశం ఇవ్వటం చాలా అరుదు. అయితే.. ఫ్లైదుబాయ పైలట్ కెప్టెన్ స్మిత్.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి వందలాది ఇజ్రాయెల్ పౌరుల్ని కాపాడిన నేపథ్యంలో ఈ అరుదైన గౌరవాన్ని ఆయనకు ప్రకటించారు.

2017 నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వం జ్యోతిని వెలిగించే అంశంపై ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చింది. ఇజ్రాయెల్ పౌరసత్వం లేకున్నా.. విదేశాల్లో ఉంటూ యూదు సమాజానికి లేదంటే ఇజ్రాయెల్ ప్రయోజనాలకు గొప్ప సేవ చేసిన విదేశీ యూదులకు ఈ జ్యోతిని వెలిగించే అవకాశాన్ని ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ గౌరవాన్ని ఈ ఏడాది అర్జెంటీనా అధ్యక్షుడు హావియరర్ మైలీ అందుకున్నారు. హమస్.. హిజ్బుల్లా లాంటి సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించటంతో పాటు.. అంతర్జాతీయ వేదికలపై ఇజ్రాయెల్ కు ఆయన అందించిన తిరుగులేని మద్దతుకు కృతజ్ఞతగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

అర్జెంటీనా అధ్యక్షుడి తర్వాత జ్యోతి ప్రజ్వలన కోసం ఆహ్వానం అందుకున్న రెండో అంతర్జాతీయ నాయకుడిగా ప్రధాని మోడీ నిలుస్తారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ దేశ అత్యున్నత పురస్కారమైన స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ ను అందుకున్న ఏకైక భారత ప్రధానిగా నిలిచారు. ఇజ్రాయెల్ చరిత్రలో యూదేతర విదేశీ నేతగా అర్జెంటీనా అధ్యక్షుడు నిలిస్తే.. తర్వాతి స్థానంలో ప్రధాని మోడీ నిలుస్తారు. దీనంతటికి మించి.. ఒక విదేశీ సామాన్యుడిగా కెప్టెన్ స్మిత్ మొట్టమొదటి వ్యక్తిగా నిలుస్తారు.