Begin typing your search above and press return to search.

రూ.2,700 మెడిసన్ రేటు రూ.27,000.. రోగుల ప్రాణాలను కాపాడే 'కార్పొరేట్' మందుల వ్యాపారం..

మందులు, వైద్య పరికరాల ధరల నియంత్రణపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కార్పొరేట్ ఔషధ సంస్థల దోపిడీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

By:  A.N.Kumar   |   30 Sept 2026 5:00 AM IST
రూ.2,700 మెడిసన్ రేటు రూ.27,000..  రోగుల ప్రాణాలను కాపాడే కార్పొరేట్ మందుల వ్యాపారం..
X

తయారీ ఖర్చు రూ.2,700... బాటిల్ మీద రేటు రూ.27,000.. ఇదేదో దొంగల ముఠా చేస్తున్న దందా అనుకుంటే పొరపాటే... మన దేశంలో రోగుల ప్రాణాలను కాపాడే 'కార్పొరేట్' మందుల వ్యాపారం.. జబ్బు నయం అవుతుందో లేదో తెలియదు కానీ మెడికల్ షాప్ బిల్లు చూడగానే ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. సామాన్యుడి జేబుకు రోజూ పడుతున్న ఈ పెద్ద కన్నాన్ని చూసి తట్టుకోలేక చివరికి సుప్రీంకోర్టే కేంద్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే...

క్యాన్సర్‌తో సహా తీవ్రమైన వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్న వేళ.. ఔషధాలు, వైద్య పరికరాల విపరీతమైన ధరలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తయారీ రంగానికి.. రిటైల్ మార్కెట్‌లో అమ్మే మార్జిన్లకు మధ్య కొండంత వ్యత్యాసం ఉండటంపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది.

తయారీ ధరకు, ఎమ్మార్పీకి పొంతనేది?

మందులు, వైద్య పరికరాల ధరల నియంత్రణపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కార్పొరేట్ ఔషధ సంస్థల దోపిడీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. "రూ. 2,700 లేదా రూ. 3,000 లకే తయారయ్యే ఒక క్యాన్సర్ మందును మార్కెట్లో ఏకంగా రూ. 27,000 ఎంఆర్‌పీ తో ఎలా విక్రయిస్తారు?" అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. కొన్ని రకాల అత్యవసర మందుల ధరలు అసలు తయారీ వ్యయం కంటే పది రెట్లు అధికంగా ఉండటం దారుణమని ఆందోళన వ్యక్తం చేసింది.

ధరల నియంత్రణ ఆర్డర్ ఏమైంది?

ప్రజా ఆరోగ్యాన్ని దృష్ట్యా ప్రతి మందు, ప్రతి వైద్య పరికరం నిత్యావసరమేనని స్పష్టం చేసిన ఉన్నత న్యాయస్థానం, వాటిని డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ) పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని నిలదీసింది. ఔషధాల రిటైల్ విక్రయాలపై కేవలం 16 శాతం లాభ పరిమితి ఉండేలా స్పష్టమైన నియమావళిని ఎందుకు అమలు చేయడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక ఎమ్మార్పీల వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఆయుష్మాన్ భారత్' వంటి ప్రజా సంక్షేమ పథకాల ద్వారా వెచ్చిస్తున్న కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అభిప్రాయపడింది. అంతేకాకుండా బిల్లులు కట్టలేదనే నెపంతో బాధితులు చనిపోయినా మృతదేహాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేంద్రం స్పందన.. విచారణ వాయిదా

దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఈ అంశంపై పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుందని కోర్టుకు తెలిపారు. ఔషధ తయారీదారులు, విక్రేతలు, ఆస్పత్రులు, రోగులు.. అందరి ప్రయోజనాలను సమతుల్యం చేసేలా సమగ్ర విధానాన్ని రూపొందిస్తామని హామీ ఇచ్చారు. పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేసింది. ఉచిత వైద్యం అందించడమే కాకుండా మందుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.

ఈ తీర్పు నిజంగా అమలైతే.. కేంద్రం చర్యలు తీసుకుంటే సగటు రోగికి, పేదలకు ఎంతో మేలు చేసినవారు అవుతారు. ఆ దిశగా అడుగులు పడితే ఆస్తులు అమ్మి చికిత్స చేసుకుంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఊరటగా చెప్పొచ్చు.