Begin typing your search above and press return to search.

'40 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం'.. కెనడాను గట్టిగా తగులుకున్న భారత రాయబారి!

దీనికి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో కెనడా కూడా దాదాపు 4 దశాబ్ధాలుగా విఫలమవుతూనే ఉంది.

By:  Raja Ch   |   15 Jan 2026 3:00 AM IST
40 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం.. కెనడాను గట్టిగా తగులుకున్న భారత రాయబారి!
X

ఉగ్రవాదులను పెంచి పోషించడంలోనూ.. ఆ తర్వాత రివర్స్ లో ఆరోపణలు చేయడంలోనూ.. అంతర్జాతీయ వేదికపై భారత్ చేతిలో మాటల దెబ్బలు తినడంలోనూ పాకిస్థాన్ ముందుంటుందనే సంగతి తెలిసిందే. ఈ కహానీ దాదాపు కొన్ని దశాబ్ధాలుగా జరుగుతూనే ఉంది. దీనికి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో కెనడా కూడా దాదాపు 4 దశాబ్ధాలుగా విఫలమవుతూనే ఉంది. తాజాగా ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ భారత రాయబారి ఆ దేశంపై ఫైర్ అయ్యారు.

అవును... ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, పైగా భారత్ కు వ్యతిరేకంగా జరిగే కేసుల్లో ఉగ్రవాదులకు శిక్షలు పడకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంలోనూ.. పైగా రివర్స్ లో భారత్ పై ఆరోపణలు చేయడంలోనూ తాము పాకిస్థాన్ కు ఏమాత్రం తీసిపోలేదన్నట్లుగా కెనడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే! ప్రధానంగా ఎయిరిండియాపై బాంబు దాడి ఘటనలో చూపించిన నిర్లక్ష్యం.. నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ పై బురద జల్లే వ్యవహారం వెరసి.. ఇది ఉగ్రవాదంపై కెనడా ద్వంద్వ వైఖరిని చూపిస్తుందని అంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా.. కెనడా మీడియా సంస్థ సీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన అక్కడి భారత్ హైకమిషనర్ దినేశ్ పట్నాయక్.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కెనడా దశాబ్ధాలుగా విఫలమవుతూనే ఉందని.. అందువల్లే భారత్‌ వ్యతిరేక కుట్రలకు ఒట్టావా కేంద్రంగా మారుతోందని.. ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో కెనడా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని పట్నాయక్ విమర్శించారు. ఈ సందర్భంగా.. పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

ఇందులో భాగంగా... కెనడా నుంచి జరుగుతోన్న ఉగ్ర కుట్రల గురించి భారత్ దాదాపు 40 ఏళ్లుగా చెబుతూనే ఉందని మొదలు పెట్టిన దినేశ్... ఎయిరిండియాపై బాంబు దాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ కేసుల్లో కనీసం ఒక్కరికైనా శిక్ష పడిందా? ఉగ్రవాద కట్టడికి ఈ దేశ నేతలెవరైనా చర్యలు చేపట్టారా? అని ప్రశ్నిస్తూ... దీన్నే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోన్నట్లు పట్నాయక్ ఆరోపించారు.

ఇక ఈ విషయాలపై భారత్ లేవనెత్తినప్పుడల్లా ఆధారాలు కావాలని ఆ దేశం డిమాండ్ చేస్తోందని గుర్తు చేసిన దినేశ్.. నిజ్జర్ హత్య కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ... అలాంటప్పుడు తమ దేశంపై కెనడా ఆరోపణలు చేసినప్పుడు కూడా ఆధారాలు చూపించాలి కదా? అని ప్రశ్నించారు. ఆ ఘటనలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని చెప్పేందుకు కచ్చితమైన సమాచారం ఉందని పదే పదే చెబుతోన్న కెనడా.. అందుకు తగిన ఆధారాలు మాత్రం చూపించడం లేదని అన్నారు.

కాగా... 2023 జూన్ 18న ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (45) కాల్చి చంపబడిన సంగతి తెలిసిందే. అయితే అతని హత్యకు భారత్‌ కారణంటూ కెనడా ఆరోపించింది. దీంతో... నాటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అనేక పరిణామాలూ చోటుచేసుకున్నాయి. అయితే కెనడా ఆరోపణలకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు చూపించలేదు!