లక్షల ఫీజులు.. అంధకారంలో భవిష్యత్తు.. కెనడాలో 'వర్క్ పర్మిట్' చిక్కుల్లో భారతీయ విద్యార్థులు
లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో చిక్కుకున్నారు.
By: A.N.Kumar | 19 July 2026 4:57 PM ISTలక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో చిక్కుకున్నారు. పోర్టేజ్ కాలేజ్ , కెనడియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్టియోపతిక్ థెరపీ ద్వారా అందించిన ‘బిజినెస్ మేనేజ్‌మెంట్ డిప్లొమా’ పూర్తి చేసిన అనేక మంది విద్యార్థులకు పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ లభించకపోవడమే ఇందుకు కారణం. ఈ నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
నిబంధనల మార్పా? అధికారుల పొరపాటా?
విద్యార్థుల వాదన ప్రకారం.. తాము వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కెనడా ప్రభుత్వం అకస్మాత్తుగా నిబంధనలను మార్చిందని.. నాన్-క్రెడిట్ ప్రోగ్రామ్‌లను పీజీడబ్ల్యూపీకి అనర్హంగా ప్రకటించిందని ఆరోపిస్తున్నారు. అయితే కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా మాత్రం తాము ఎలాంటి కొత్త నిబంధనలను తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇదే కోర్సు పూర్తి చేసిన కొందరు విద్యార్థులకు వర్క్ పర్మిట్ లభించగా మరికొందరికి మాత్రం నిరాకరించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.
ఛిన్నాభిన్నమవుతున్న విద్యార్థుల కలలు
ఈ కోర్సు కోసం విద్యార్థులు కేవలం ట్యూషన్ ఫీజుల రూపంలోనే దాదాపు 32 వేల కెనడియన్ డాలర్లు చెల్లించారు. వసతి, జీవన వ్యయాలు దీనికి అదనం. "నా చదువుల కోసం నా తండ్రి జీవితాంతం కూడబెట్టిన పొదుపు మొత్తం ఖర్చు చేశారు. రెండేళ్ల చదువు పూర్తయిన తర్వాత కెనడాలో ఉద్యోగం చేసి అనుభవం సంపాదిస్తానని భావించాను. కానీ ఇప్పుడు నా భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది" అని జస్పిందర్ కౌర్ అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.
మరో విద్యార్థి ముకుల్ రాణా మాట్లాడుతూ ఇది కేవలం ఒక పరిపాలనా సమస్య మాత్రమే కాదని, వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్న "మానవతా సంక్షోభం" అని పేర్కొన్నారు. వర్క్ పర్మిట్ నిరాకరణ వల్ల వేలాది మంది ఉపాధి అవకాశాలను కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు ఏమిటీ పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్? దీని ప్రాధాన్యత ఏంటి?
పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది కెనడాలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలో అర్హత కలిగిన కోర్సు పూర్తి చేసిన అంతర్జాతీయ విద్యార్థులకు ప్రభుత్వం జారీ చేసే ఓపెన్ వర్క్ పర్మిట్. దీని ద్వారా విద్యార్థులు కెనడాలో ఏ సంస్థలోనైనా ఉద్యోగం చేసి స్థానిక అనుభవాన్ని సంపాదించవచ్చు. ఈ కెనడియన్ వర్క్ అనుభవం భవిష్యత్తులో అక్కడ శాశ్వత నివాస హక్కు పొందేందుకు అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ పర్మిట్‌ను కేవలం ఒకసారి మాత్రమే ఇస్తారు, దీనిని మళ్లీ పునరుద్ధరించే అవకాశం ఉండదు.
బాధ్యత ఎవరిది? సోషల్ మీడియాలో హీటెక్కిన చర్చ
ఈ వివాదంలో కాల్గరీకి చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది లారా-ఆన్ గోల్డింగ్ స్పందిస్తూ తమ కార్యాలయాన్ని ఇప్పటికే డజన్ల కొద్దీ బాధిత విద్యార్థులు సంప్రదించారని తమ సంస్థ ఒక్కటే సుమారు 200 మంది విద్యార్థుల కేసులను పరిశీలిస్తోందని వెల్లడించారు. ఈ వివాదంలో కాలేజీల పాత్రపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ, సంబంధిత విద్యాసంస్థలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరోవైపు ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్సు పూర్తయ్యాక వర్క్ పర్మిట్ వస్తుందని నమ్మించి.. విద్యార్థుల నుండి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసిన విద్యాసంస్థలపైనే అసలు బాధ్యత ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే రెండేళ్ల డిప్లొమా చదివిన ప్రతి ఒక్కరికీ వర్క్ పర్మిట్ లేదా శాశ్వత నివాస హక్కు ఇవ్వాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. లక్షల రూపాయల అప్పులు చేసి కెనడా అడుగుపెట్టిన విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఏం కానుందో అనే సంశయం అందరిలోనూ నెలకొంది.
